Wednesday, January 22, 2025

…మంత్రానుష్టానం

జీవులన్నింటిలో మానవుడు జ్ఞానం కలిగిన వాడు. జీవిత సాఫల్యత కొరకు మార్గాన్వేషణ తెలుసుకున్నవాడు. అందుకే మనం ప్రతి నిత్యం చేసే అనుష్టానంలో శ్లోకాలు, కీర్తనలు, స్తోత్రాలు అనుసరిస్తాము. మంత్రం మాత్రం కొన్ని సందర్భాల్లో మాత్రమే అనుసరిస్తాము. మంత్రం అంటే ”మననాత్‌ త్రాయతే ఇతి మంత్ర:” అంటే మననం చేసేవాడిని రక్షించేది అని అర్థం. మనం జన్మించినప్పటి నుంచి, మరణించే వరకు మంత్రాలతో సంబంధం ఉంది. నామకరణంలో మంత్రాలు, ఉపనయన సంస్కారంలో మంత్రాలు, వివాహం సమయంలో మంత్రాలు, ఆఖరికి మరణించిన తరువాత కూడా జీవిని ఊర్ధ్వలోకానికి పంపడానికి, శాంతికి మంత్రాలు. మన గ్రహస్థితి అనుకూలంగా లేని సందర్భంలో, సంబంధిత గ్రహానికో, గ్రహాలకో, వారికి సంబంధించిన మంత్రాలు జపం చేయిస్తూ ఉంటాం. ఇలా మంత్రాలు మన జీవన గమనంలో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒక్కటి గమనించాలి. ఏమిటంటే పైమంత్ర కార్యాలు అన్నీ ”అగ్ని” సాక్షిగానే జరుగుతుంటాయి.
మంత్ర జపం ఎందుకు?
మంత్ర జపం కార్యసిద్ధికి, మనోభీష్టాలు నెరవేరడానికి చేస్తూంటారు. ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. ఉదా… ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రానికి అధిష్టాన దేవత శ్రీహరి శ్రీమన్నారాయణుడు. అలాగే, ”ఓం నమశ్శివాయ” ప్రణవంతో కూడిన పంచాక్షరీ మంత్రం. దీని అధిష్టాన దేవత మహేశ్వరుడు. మంత్ర జపం చేసేవారికి ముందుగా మంత్రం మీద, ఆ అధిష్టాన దేవత మీద నమ్మకం ఉండాలి. భక్తి శ్రద్ధలు ఉండాలి.
గడచిన యుగాలలో మహర్షులు తపస్సు చేసి ఆత్మ జ్ఞానం పొందారు. మరి కొంతమంది మోక్షం పొందారు. కాని, ఈ యుగంలో అంత శ్రద్ధగా, దీర్ఘకాలం బాటు చేసే శ్రద్ధ, భక్తి మనలో లేవు కదా. అయితే కొంతమంది ఆరోగ్య సమస్యలకి, కార్యసాధనకు మంత్రం ఉపాసన పొంది మాత్రమే జపం చేయాలి. మంత్రం ఎప్పుడు పడితే అప్పుడు, శుచిత్త్వం లేకుండాను జపించకూడదు. మంత్ర ద్రష్ట మీకు మంత్రం ఇచ్చే సందర్భంలో అనుసరించవలసిన నియమములు చెపుతారు. మంత్ర జపానికి కూడా సంఖ్య ఉంటుంది. సాధారణంగా, మంత్రంలో ఉన్న అక్షరాలు ఎన్ని ఉంటే అన్ని లక్షల సార్లు చేయాలి అని శాస్త్రవచనం. ధృవుడు తపస్సు చేయడానికి వెడుతూంటే నారదమ#హర్షి ఎదురుపడి, విషయం తెలుసుకొని, ధృవుడుకి ”ఓం నమో నారాయణాయ” అనే మహావిష్ణువుకు సంబంధించిన అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించాడు.
అపుడు ధృవుడు తదేక దీక్షతో, భక్తి శ్రద్ధలతో, మంత్రాన్ని దీర్ఘకాలం తపస్సు చేసి, ధృవతారగా వెలుగొందుతున్నాడు.
మంత్ర జపం మూడు రకాలు 1) బా#హ్య జపం 2) ఉపాసనా జపం 3) మానసిక జపం. బాహ్య జపం అంటే జపమాలను త్రిప్పుతూ మంత్ర శబ్దాన్ని పైకి వినపడేటట్లు చేసేది. ఉపాసనా జపం అంటే రుద్రాక్షను త్రిప్పుతూ పెదవులతో చేసేది (పైకి వినపడదు) ఇక మానసిక జపం అంటే మనసులోనే ఏకాగ్రతతో కళ్ళు మూసుకుని, జపమాల త్రిప్పుతూ చేసేది. ఈ మూడింటిలో బాహ్య జపం తక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
మంత్రాలకు చింతకాయలు రాలతాయా?
ఈ సామెత ఎలా వాడుకలోకి వచ్చిందో తెలియదు కాని, ఒక పురాణ ప్రవచకులు చెప్పినట్లుగా, మంత్రాలకు చింతకాయలు రాలడం సంగతి దేవుడెరుగు, సంసారంలో ఉన్న చింతలు (కష్టాలు) రాలతాయి. (పోతాయి) అని అర్థం. నా భావనలో చింతకాయ కొమ్మని ఎంత గట్టిగా పట్టుకొంటుందో, అలాగే మంత్రాన్ని మనం గట్టిగా (బాగా) జపం/ అనుష్టానం చేయాలి అని.
మంత్రం కేవలం పీఠాధిపతులు, మఠాధిపతులు, వేదం తర్కం వంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న పండితులు వద్దనుండి పొందవచ్చు. అంతేకాని, ఏ సన్యాసి నుండో, కనపడిన యోగులు నుంచో స్వీకరించకూడదు. ఫలితాన్ని ఇవ్వదు. పీఠాధిపతులు కూడా మంత్ర దీక్ష కోరేవారిని పరీక్షించే ఉపాసన చేస్తారు. కాబట్టి మంత్రాలకు ఇంతటి విశిష్టత ఉంది.

  • అనంతాత్మకుల రంగారావు
Advertisement

తాజా వార్తలు

Advertisement