Wednesday, January 29, 2025

గుర్తింపు

గుర్తింపు… గౌరవం ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా జీవితాన్ని కూడా మార్చివేస్తుందని చెపుతారు. తాను కోరినట్లు కాకుండా తాను న్యాయంగా చేయగలిగిన దానికే గుర్తింపు ఉండాలి. జనం గుర్తింపునకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ఎవరికి పేరు వస్తుందనే చింత లేకుండా మనం సాధించగలిగినది ఎంతో ఉంటుంది. ఒక మంచి పనికి ప్రశంస, శభాష్‌ అనే మాట మంచి ఫలితాలను ఇస్తుంది.
గుర్తింపుకు ప్రాధాన్యం ఇవ్వాలా, వద్దా అనేదికూడా మన నైజాన్ని బట్టే ఉంటుంది. ఇతరులనుండి అది దక్కాలని ఆశించినపుడు అది దక్కకపోతే విచారిస్తారు. ఒక్కొక్కసారి ఆ గుర్తింపు వచ్చినప్పుడూ దానిని తిరస్కరించాలని అనిపించవచ్చు. ఇతరులతో మన సంబంధాలను బట్టి చాలావరకు మన వ్యక్తిత్వం రూపొందు తుంది. వారు మన విలువను గుర్తిస్తే మన ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెంపొందుతాయి.
మనుషులకు గౌరవం పొందామనే భావన మానసిక అవసరమని చెపుతారు. తాము చక్కగా పనిచేశామని, తమ కృషిని ఇతరులు గుర్తిస్తే తమకు తృప్తిగా ఉంటుంది. తామేదో సాధించామనే సంతోషం కలుగుతుంది. గుర్తింపువల్ల మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవటానికి స్ఫూర్తి లభిస్తుంది. గుర్తింపుకోసం ప్రచారం అవసరమా అంటే అది అవసరమే. కాని, శృతిమించి రాగానపడితే దానిని విశ్వసించటం కష్టమే అవుతుంది. మన పనులే మనకు రాయబారులుగా ఉండాలి. మన విలువ, మన సామర్థ్యం అవే తేటతెల్లం చేయాలి. ఉనికిని తెలియజేయ టానికి ప్రచారమూ అవసరమవుతుంది. ఎక్కువ ప్రచారం అవసరం లేకుండా తమ తమ రంగాలలో, వర్గాలలో, సమూహాలలో కూడా గుర్తింపు లభిస్తుంది. నూతనావకాశాలూ లభిస్తాయి.
ఎక్కువ ప్రచారంతో, ఎక్కువ ప్రశంసలతో తాము ఇతరులకంటే అధికులమని, తమని మించినవారు లేరని గర్వించేవారు కొందరుంటారు. ఏ స్థితికి చేరినా తమ గురించి తమకు అవగాహన ఉండాలి. ప్రజల దృష్టిలో తాము ఉన్నప్పుడు ఎదుర్కోవలసిన సవాళ్ళను, వస్తున్న అవ కాశాల వినియోగాన్ని అర్థంచేసుకోవాలి. గుర్తింపు అనేది అవసరమైనా దానికోసం పాకులాడటం, అదే ముఖ్యమనుకోవటం ఆయా వ్యక్తుల దృక్పథంమీద ఆధారపడి వుంటుంది. తమ లక్ష్యాలు, విలువలు గుర్తుంచుకొని, తమ ఆనందాన్ని దృష్టిలో ఉంచుకొని సంతులనతో వ్యవ#హరించటం అన్ని సందర్భాలలో అవసరమవుతుంది.
మనిషి గుర్తింపు ఏదో ఒక చోట కోరుకుంటాడు. ప్రతి గుర్తింపు ఒకేలా ఉండాలి అని నియమం లేదు. కొందరికి చప్పట్లు కొట్టించుకుంటే ఇష్టం. కొందరికి లైకులు పెరిగితే ఇష్టం. కనీసం జీవిత భాగస్వామి దగ్గర కూడా గుర్తింపు కోరుకుంటారు. ఈ మాత్రం గుర్తింపు లేకపోతే ముందుకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి గుర్తింపు ధనార్జన కోసం లేదా వారు చేసే సహాయం నలుగురికి తెలియడం కోసం కూడా అవసరం. మరింత మందికి తెలియాలి అని గుర్తింపు కోరుకోవడం తప్పు కాదు, కోరుకోకపోవడం కూడా తప్పు కాదు.
అయితే, గుర్తింపు లేని జీవితం వ్యర్ధమా అంటే అదీ కాదు. అందరికీ గుర్తింపు రాదు, కుదరదు, ఎవరి భాద్యత వారు నిర్వ#హంచాలి. జీవితం వ్యర్ధం అని ఎప్పుడూ అనుకోవద్దు. తెలివితేటలు, శౌర్యం, మధురమైన వాక్కు, జ్ఞానం, ధైర్యం, తక్కువ మాట్లాడటం, ఇతరుల ఉపకారాన్ని గుర్తుంచుకోవడం, దానధర్మాలు చేయడం మొదలైన లక్షణాలు కలిగినవారు సమాజంలో ఎప్పుడూ ప్రశంసలు పొందుతారని ఆచార్య చాణక్య ఉవాచ.
ఎదుటివారి మాటలను ఓపికగా విని, వారు చెప్పేది సమగ్రంగా గ్రహించేవాడు తప్పులు చేయకుండా తన తెలివితేటలతో పనులను పూర్తి చేస్తాడు. అలాంటి వారే జ్ఞానవంతులని అనిపించుకుంటారు. అలాంటి వారికి ఉండే స#హనమే వారిని విజయపథంలోకి తీసుకెళ్తుంది.
విదురుడు జీవన విధానాల ఆధారంగా సమాజంలో ఎంతో గుర్తింపు పొందాడని మనందరికీ తెలుసు. ఆయన జీవన విధానం మనం తెలుసుకోవాలి. మహాభారత యుద్ధానికి ముందే, విదురుడు ధృతరాష్ట్రునికి యుద్ధ ఫలితాల గురించి తెలియజేశాడు. విదురుడు చెప్పిన విషయాలు ఆ కాలంలో ఎంత ముఖ్యమైనవో నేటి కాలంలో కూడా అంతే ఉపయోగపడతాయని చెబుతుంటారు. జీవితంలో విదురుని విధానాలను అమలు చేసే వ్యక్తి విజయ వంతుడవుతాడని చెబుతారు.

  • ఆనంద ‘మైత్రేయ’మ్‌
Advertisement

తాజా వార్తలు

Advertisement