Monday, November 25, 2024

అక్రూరుని హస్తినాపుర దర్శనం!

అధర్మవర్తనుల వలన పెరిగిన భూభారమును తగ్గించుటకు అవతరించిన మహామాయావతా రుడు శ్రీకృష్ణ భగవానుడు. యదువంశ భూషణుడైన వసుదేవ, దేవకీదేవిల అష్టమ గర్భ మర్మజ్ఞ మోహనుడు వాసుదేవుడు. మానవాళికి అజరామరమైన భగవద్గీతను అందించిన జగద్గురువు. వైకుంఠధామము నుండి విచ్చేసిన వనమాలి. వేదనాదమును వేణునాదముగా అందించిన గోపాలుడు. పరమ యోగులకు మాత్రమే శ్రీకృష్ణుని దివ్య త్వము అవగతమవుతుంది. మిగిలినవారందరికి కృష్ణ ప్రేమ పారవశ్యాన్ని కలిగిస్తుంది. ఆ పారవశ్య ప్రాభ వమే ఆత్మానందము. అవతార ఆద్యంతమూ అద్భుత లీలా విలాసముతో తనువు పులకరిస్తుంది. అంతరంగమున మధి స్తే లీలాసారం బోధపడుతుంది. కంసుని వధించిన తరువాత అతని ఆంతరంగికుడు అయిన అక్రూరుడు శ్రీకృష్ణ బలరాముల దివ్యశక్తులను గ్రహించి వారికి తన సేవలను అందించసాగెను. వసుదేవుని చెల్లెలయిన కుంతీదేవి శ్రీకృష్ణుని మేనత్త. ఆమె పూర్వనామ ము పృథ. కుంతి భోజునికి దత్తత ఈయబడింది. పాండు రాజు మరణానంతరము పాండవులతో కలసి హస్తినాపుర మున ఆశ్రయం పొందింది. ఆమె స్థితిగతులను తెలుసుకుని రమ్మని అక్రూరుని హస్తినాపురమునకు పంపాడు శ్రీకృష్ణుడు. అత్యంత వైభోగమును అనుభవించుచున్న ధృతరాష్ట్రు ని కలుసుకున్నాడు అక్రూరుడు. అనేక ఏనుగులతో అల రారుచున్న ఆ నగరము చాలా సంపన్నమైనది. అప్పటికి హస్తినాపుర రాజు సమస్త భూమండలమునకు చక్రవర్తిగా ప్రకటితమయినాడు. ధృతరాష్ట్రుని, భీష్మాచార్యుని దర్శిం చిన అనంతరము విదురుని, కుంతిని, పాండవులను, కౌర వులను కలుసుకున్నాడు. అందరూ అక్రూరునికి ఆదరముతో స్వాగతం పలికారు. అందరితో కలిసి మాట్లాడుతూ హస్తినా పురమునందు జరుగుచున్న రాచకార్యములు, ధర్మాధర్మ ములు అవగాహన చేసుకోసాగాడు క్రూరుడు.
పాండురాజు మరణానంతరము పాండవులకు తగిన స్థితిగతులను కల్పించకుండా ధృతరాష్ట్రుడు పరిపాలన చేయుచున్నాడు. తన కుమారులకు రాజ్యము కట్టబెట్టడానికి అనేక దుష్ట కార్యములను ప్రోత్సహించుచూ పాండవులను అంతం చేయడానికి చూస్తున్నాడు. పాండవుల శౌర్య పరాక్ర మముల పట్ల అసూయతో కౌరవులు దహించుకుపోవుటను తండ్రిగా నివారింపలేదు. దైవాంశ సంభూతులైన శ్రీకృష్ణ బలరాములను కుంతీదేవి నిత్యమూ ధ్యానించుచూ వారి సహాయము కొరకు ఎదురుచూస్తోంది. విదురుని సలహాల ను విన్నట్లు నటించుచున్న ధృతరాష్ట్రుడు తన కుమారులకు న్యాయము చేయడని తలంచుచున్నది. ఈవిధముగా హస్తినాపురములోని ఒక్కొక్కరిని కలుసుకున్న అక్రూరుడు పరిస్థితిని గ్రహించాడు. కొన్ని మాసములు గడిచిన పిదప అక్కడ దురాగతాలను అవగాహన చేసుకున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు తనను హస్తినాపురమునకు ఎందుకు పంపినాడో పూర్తిగా అర్థమయిన అక్రూరుడు ధృతరాష్ట్రుని కలుసుకొని ఈవిధంగా చెప్పసాగాడు. ”పాండవుల సింహాస నమును నీవు ఆక్రమించుకున్నావు. ఎంతో పేరుప్రఖ్యాతు లున్న హస్తినాపుర సార్వభౌమాధికారమునకు కళంకము రాకూడదని భావిస్తున్నాను. ధర్మ మార్గమున పయనించు చూ ప్రజలను కూడా అదే మార్గమున చరించుటకు దోహద పడగలవని అర్థిస్తున్నాను. పాండవుల హక్కులను కాపాడ వలసిన నీవే హరించుట న్యాయము కాదుకదా! తదుపరి, ఈ జన్మతోసహా మరుజన్మలో నరకప్రాయమైన గతులు కలుగ గలవు. నూటఐదుగురు నీకు సంతానముగా భావించినచో అప్రతిహతమైన కురు సామ్రాజ్యము, భీష్మపితామహుల ఆశీస్సులతో ఈ భూమండలము, యుగాంత పర్యంతము సుఖశాంతులతో తులతూగగలదు. ఏ కాలమున అయిననూ ధర్మమే జయిస్తుంది. నా పరిశీలనలో ధర్మ దేవత కుంతీదేవి సరసన కూర్చుని ఉన్నది. కావున పెద్దవాడివైన నీవు అరిష డ్వర్గములకు లొంగక పాండవుల బహు పరాక్రమము, బుద్ధి కుశలత, దైవభక్తిని గుర్తించి వారికి సముచిత స్థానము కల్గించ మని కోరుతున్నాను. ఈ ఇహములో ఎవరూ శాశ్వతులు కారు. ప్రస్తుతము లభించిన సంబంధ బాంధవ్యములన్ని యు ఈ జన్మతో సరి. దేహత్యాగము చేసిన తరువాత ఎవరికి వారే! సంచిత కర్మల వలన నీ జ్ఞాపకశక్తి ఈ జన్మతో పరిసమా ప్తియగును. సద్గతి పొందుటకు ఈ జన్మలోనే ఆలోచించి సాధన చేయవలనె కదా!
అధర్మ వర్తన వలన అనేక జన్మలు గడచినా సంసార చక్రము నుండి బయటపడుట అసంభవము. దీనంతటికి కారణము అజ్ఞానము. విశేష శ్రమ వలన ప్రోగుచేసిన సంపదలు సంతతి వలన క్షణములో హరించి పోవును. కావున సంతానమునకు సంస్కార సంపదను అందించుట ముఖ్యము. కలిసి జీవించిన బంధువర్గము వారి పూర్వజన్మ వాసనా ఫలిములననుసరించి విడివిడిగానే ప్రారబ్ధమును అనుభవింతురు. ఎవరి విధివ్రాత వారిదే! ఎన్నో సామ్రాజ్య ములు చక్రవర్తి యొక్క అనుచిత వర్తనవల్ల నాశనమ యిపోయినవి. అధర్మ మార్గమున ఆర్జించిన, లభిం చిన సంపదలు తెలియకుండాపరుల పాలగుట తథ్యము. అందు వలన అవసరమయిన మేరకు ఆర్జించిన ధనము మాత్రమే అక్కరకు వస్తుంది. తన శ్రేయస్సు కోరుకునేవారు ధర్మ మార్గమున పయనించవలెనని నా అభిప్రాయము” అని ముగించాడు. అంత ధృతరాష్ట్రుడు ”శ్రీకృష్ణ పరమాత్మ యదువంశ మున అవతరించిన కారణము నాకు బోధపడినది. అయి ననూ నా మనసు మోహమును వీడుటలేదు. భూభారము తగ్గించువాడు, భూమికి భారమైనవారు ఎవరన్నది నా మనసుకు తెలిసియున్ననూ నా చిత్తము అయోమయ స్థితి లోనే కొనసాగుచున్నది. త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతిలో జీవుడనైన నేను దానికి బద్ధుడైపోయినాను. జగత్తును సృష్టించిన పరమాత్మ మనందరియందు నిండి క్రీడించుచు న్నాడని భావించగలను. కావున భవిష్యత్‌ దర్శనము కొరకు వేచియుండుట తప్ప ఏమీ చేయజాలము” అని ముగిం చాడు ధృతరాష్ట్రుడు. ఆయన మాటలు విన్న అక్రూరుడు ధృతరాష్ట్రుని మనోగతము మోహము వీడలేదని గ్రహిం చాడు. దేనికైనా కాలమే పరిష్కారం చూపాలి అనుకుని అక్రూరుడు ద్వారకకు పయనమయ్యాడు.
– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement