Sunday, November 10, 2024

హనుమాన్ జయంతి.. ఇవ్వాల ఖగోళంలో మహాద్భుతం

హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి. ఆయన జన్మనక్షత్రం పూర్వాభాద్ర. అయితే స్వాతి నక్షత్రానికి హనుమంతుడు అధిదైవం. హనుమజ్జయంతి నాడు ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలు కనిపిస్తాయి. హనుమంతునికి సంబంధించిన ప్రతిపర్వం ఖగోళ విశేషాలతో ముడిపడిందే…

వైశాఖ బహుళ దశమీ శనివారం పూర్వాభాద్రా నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని పరాశర సంహిత వివరిస్తోంది. అలాగే, స్వాతం కుజే శైవ తిధౌతు కార్తికే కృష్ణంజనా గర్భత ఏవసాక్షాత్ కార్తీక బహుళ చతుర్దశి స్వాతి నక్షత్రం మంగళవారం మారుతాత్మజుడు జన్మించాడని వైష్ణవ మతాబ్జ భాస్కరం తెలియచేస్తోంది. ఇంకా చైత్రమాసే సితే పక్షే పౌర్ణమాస్యాం కుజేహని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఆంజనేయుడు ఉదయించాడని తంత్రసారం స్పష్టం చేస్తోంది.

మన రుషులు అపార ప్రజ్ఞావంతులు. వారికి సృష్టిలోని అణువణువుతోనూ పరిచయం ఉంది. కాబట్టే వారు భూగోళంపై నడయాడుతున్నా ఖగోళంలో ఎక్కడ, ఎప్పుడు ఏది జరుగుతుందో లెక్కకట్టి చెప్పగల మేధాసంపత్తి గలవారు. వారు ఖగోళంలో ఏర్పడే మార్పులను బట్టి పర్వాలను నిర్ణయించారు. ఈ సంప్రదాయం వేదకాలం నుంచి ఉంది.

- Advertisement -

ప్రాతర్యావాణా ప్రథమా యజధ్వమ్
అంటోంది ఋగ్వేదం. అంటే ఏ రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ రోజు ఆ నక్షత్రానికి సంబంధించిన అధిదేవత పూజలందుకుంటాడు. వినాయక చవితి, హనుమజ్జయంతి అలాంటివే. భాద్రపద మాసంలో హస్తానక్షత్రం రోజున వినాయక చవితిని నిర్వహించుకుంటాం. అంటే హస్తా నక్షత్రానికి అధిదేవత వినాయకుడు. ఆ విధంగానే హనుమంతుని జన్మ నక్షత్రం స్వాతి. అమోఘమైన శక్తిమంతమైనదీ నక్షత్రం.

అమిత వేగవంతుడు, బలసంపన్నుడైన వాయుదేవుని అంశతో పుట్టినవాడు హనుమంతుడు. కాబట్టే అజేయ పరాక్రమవంతుడయ్యాడు. ఎవ్వరికీ అలవి కాని సముద్రాన్ని లంఘించాడు. లంకలో అశోకవనాన్ని విచ్ఛిన్నం చేశాడు. ఈ క్రమంలో బలవంతులైన ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. స్వాతి కార్తె సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆంజనేయుడు సముద్రాన్ని దాటే సమయంలో కూడా ఆయన వేగానికి సముద్రమంతా కకావికలమై పోయింది. అలాగే, స్వాతి నక్షత్రం శుక్రగ్రహంతో కలిసి ఉంటుంది. సహజంగా ఈ రెండూ కలిస్తే గాలికి వర్షం కూడా తోడవుతుంది. ఇలాంటి సమయంలోనే వరదలు, ఉప్పెనలు, తుఫానులు వస్తాయి. మేషరాశి అస్తమించే సమయంలో అంటే సూర్యాస్తమయంలో సప్తమలగ్న వేళ తులారాశి అవుతుంది. కాబట్టి ఈ తులా లగ్నంలో కూడా స్వాతి నక్షత్రమే ఉంటుంది. అందుచేత స్వాతి నక్షత్రం అంటే సాక్షాత్తూ ఆంజనేయుడే. కాబట్టి ఇదే వైశాఖ బహుళ దశమి సమయం. ఈ వేళలోనే హనుమంతుడు జన్మించాడు.

ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో ఉన్న చుక్కలుంటాయి. ఈ విషయం బాల్దియా, బాబిలోనియా, ఈజిప్టు దేశాల్లో లభించిన సాక్ష్యాల వల్ల తెలుస్తోంది. ఆదికవి వాల్మీకి కూడా రామాయణంలో ఈ విషయాన్ని
అనుయాస్యన్తి మామధ్య ప్లవమానం విహాయసా భవిష్యతి హిమే పంథా స్స్వాతేః పంథా ఇవాంబరే అని పేర్కొన్నాడు. అదీకాక స్వయంగా హనుమంతుడే తాను స్వాతి నక్షత్రమని తోటి వానరులతో చెప్పుకున్నాడట. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా రామాయణ కల్పవృక్షంలో ద్విత్రి విలిప్తలన్ గగన వీధి జరింతును నేను స్వాతి నక్షత్రము వోలె… అని ఆంజనేయుడే అన్నట్లు చెప్పారు.

ఆంజనేయుడు గొప్ప విష్ణు (రామ) భక్తుడు కూడా. ‘వియద్విష్ణు పదంవ్యోమ్ని’ అని అమరం చెబుతోంది. విష్ణుపదం అంటే ఆకాశం అని అర్థం. విష్ణువు ఉండే చోటు కూడా స్వాతి, శ్రవణా నక్షత్రాల మధ్య ఉంటుంది. శ్రవణా నక్షత్రం అంటే విష్ణుమూర్తి వాహన రాజమైన గరుత్మంతుడు. ‘ససుపర్లో గరుత్మాన్’ అని ఋగ్వేదం స్పష్టం చేస్తోంది. దీన్నే పాశ్చ్యాత్యులు ఏక్విలా అంటారు. విష్ణుమూర్తి గరుత్మంతుని (శ్రవణం) కి. ఆంజనేయుని(స్వాతి)కి మధ్యనే ఉంటాడు. అందుకే ఆయన్ను అగ్రే ప్రాంజలిరాంజనేయ మనిశం అని స్తుతిస్తారు. అన్నమయ్య కూడా హనుమంతుణ్ణి విష్ణుసేవకుడిగానే కీర్తించాడు. కాబట్టి హనుమంతుణ్ణి విష్ణు భక్తునిగా చెప్పడంలో ఆంతర్యం ఈ ఖగోళ వృత్తమే. స్వాతి నక్షత్రం పాశ్చ్యాత్యులు చెబుతున్నట్టు బూటేస్ అనే చుక్కల సమూహానికి చెందింది. భూతేశుడు (బూటేస్ అంటే రుద్రుడు. హనుమంతునికి ఆ భూతేశునితో సంబంధం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement