సద్గురువు శిష్యులను సరైన మార్గంలో నడిపి స్తారు. మంచి మార్గోపదేశం సూచించి అపాయాల నుంచి తప్పిస్తారు. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమార్గాన్ని చూపి స్తారు. ఈ త్రిభువనాలలో గురువు కంటే గొప్ప దాత మరొకరు ఉండ రు . కల్పతరువు కల్పిత వస్తువులను మాత్రమే ఇవ్వగలదు. చింతామణి కోరుకున్న దానిని మాత్రమే ప్రసాదిస్తుంది. కానీ గురువులు మనసు ఊహించని నిర్వికల్ప స్థితిని మనకు అందించగలరు. ఆశించని ఆత్మస్థితి సిద్ధింపచేయగల శక్తిసంపన్నులు గురువులు. అటువంటి గురువులకు భక్తితో సేవ చేసినవారు బ్రహ్మ సాయుజ్యాన్ని పొందుతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే గురువుకు సేవ చేసుకునే అవకాశం లభించడం మహద్భాగ్యం అంటారు. గురువులు మహానుభావులు. వారికి మన ఉపచారాలు అవసరంలేదు కానీ మనం గౌరవభావం, భక్తి భావంతో ఉపచారాలు చేస్తే సంతోషంగానే స్వీకరిస్తారు. గురుసేవా భాగ్యం కలిగినప్పుడు బద్ధకం, అలసత్వం, అవిశ్వాసంలాంటివి దరిచేరకూడదు. ఇతర కార్యాలపై మనస్సు పోకుండా గురు చరణాలపై దృఢవిశ్వాసంతో సేవలందించాలి. అలా గురువుకు చేసే సేవను గురుశుశ్రూష అని కూడా అంటారు. గురుశుశ్రూషను ప్రధానంగా నాలుగు విధాలుగా విభజించారు. అవి-
(1) స్థాన శుశ్రూష : గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం. ఆయన పరిసరాలను శుభ్రం చేయటం. ఆయన వాడే వస్తువులను శుభ్రం చేయటం. (అదీ తప్పనిసరి కర్తవ్యంగా గాక తనకు అదృష్టవశాత్తు లభించిన అవకాశంగా భావించి చేయాలి.)
(2) అంగ శుశ్రూష : స్వయంగా ఆయన పాదాలొత్తి సేవ చెయ్యటం. గురువు ఆరోగ్య విషయాలను స్వయంగా చూసుకుంటూ తగిన ఏర్పాట్లు చెయ్యటం. ఆయన అవసరాలను నిరంతరం కనిపెట్టి ఉండటం.
(3) భావ శుశ్రూష : గురువుగారి మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకనుగుణంగా నడుచుకోవటం. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం. ఆయనకు ఏ లోటూ కలగకుండా చూచుకోవటం.
(4) ఆత్మశుశ్రూష : తన మాటలు- చేతలు గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం. ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం. తన శరీరం- తన ధనసంపదలు- తన మనస్సు సర్వమూ గురువు కోసమేననే భావన బుద్ధిలో దృఢంగా ఉండాలి.
– డా. చదలవాడ హరిబాబు 9849500354
గురుసేవే మహద్భాగ్యం !
Advertisement
తాజా వార్తలు
Advertisement