నేడు గురుపౌర్ణమి
అజ్ఞాన చీకట్లను జ్ఞానకాంతులతో పారదోలే దివ్య చైతన్య స్ఫూర్తి గురువు. జ్ఞానశక్తితో, ఉదాత్తమైన యుక్తితో శిష్యుల సందేహాల్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే ఉన్నతమూర్తి గురువు. విద్యాభ్యాసం ద్వారా హతో పదేశం చేయడ మేకాక అభ్యుదయ మార్గాన్ని దర్శింపజేసే వాడే గురువు.” మన సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆషాఢమాసంలో శుక్ల పక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యా స పూర్ణిమ అంటారు. ఈరోజున మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు. పురాణాల ప్రకారం, ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల, ఆయనను అం దరూ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన జన్మదిన సందర్భం గా గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు గురు వుతోపాటు వేదవ్యాస మహర్షిని పూజిస్తారు. ఈరోజు గురువులను పూజించి, ఆశీర్వాదం తీసుకున్నవారికి ఖచ్చితంగా శుభ ఫలితాలొ స్తాయని చాలామంది నమ్మకం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరి జా తకంలో అయితే గురు స్థానం బలంగా ఉండదో వారు ఈరోజు గురు పూజ చేయడం ద్వారా మంచి ప్రయోజ నాలను పొందుతారు.
మనలోని సామర్థ్యాన్ని గుర్తించి, మరింత మెరుగుదిద్ది, జ్ఞాన జ్యోతిని వెలిగిం చి ప్రగతి పథంలో నడిపించేవారే గురువులు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అని అర్థం. అలాంటి గురువులను ఆరా ధించడం కోసమే గురు పూర్ణిమ తిథిని నిర్ణయించారు పెద్దలు.
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే:పౌత్రమకల్మషమ్|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వైబ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమోనమ:||
గురు సంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమ శివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం (శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీమహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. (శివకేశవులకు బేధంలేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్నకోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మ#హర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమా రుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.
కలియుగంలో మనుష్యుల ఆయుష్షు (జీవితకాలాన్ని), బు ద్ధిని, జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారం భానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరు గాంచారు.
”గురు రాదిరనాదిశ్చ గురు:పరమ దైవతం
గురో: పరతరం నాస్తి తస్మై శ్రీ గురవేనమ:” అని”విశ్వ సారతంత్ర” చెప్పింది. సృష్టికి ఆది, అనాది, పరమోత్తమ దైవం గురువు. గురువుకు మించింది లేదు” అని భావం.
గురువు అంటే నాలుగు ముఖాలు లేని బ్రహ్మ. అంటే జ్ఞాన, చైతన్య ప్రదాత. నాలుగు భుజాలులేని విష్ణువు. అంటే రక్షకుడు, అపమార్గం నుంచి తప్పించి సరైనదారిలో పెట్టే మార్గదర్శి. మూడు నేత్రాలులేని శివుడు కూడా. అనగా అజ్ఞా నాన్ని లయం చేసేవాడు. కనుక గురువు త్రిమూర్తి అవతారం. ప్రత్యక్ష దైవం కనుక ఆచార్య దేవుడు అంటారు. గురు దీవన బలమైనది. వ్యక్తి ఉన్నతికి సోపానం కూడా. గురువుకు ఏమైనా కొమ్ములున్నాయా అంతగా ఆరాధిస్తారు. అనే ప్రశ్న రావచ్చు.అవును నిజంగానే ఈ ప్రశ్న వచ్చింది భేతాళుడికి.
ఒకసారి విక్రమార్క మహారాజు రాజభవనం నుంచి సరాసరి, ఒక కుటీరంలో చిన్న అంగవస్త్రంతో కూర్చుని ధ్యా నం చేసుకొంటున్న ఒక మహర్షిని సందర్శించి, కుశల ప్రశ్న లు వేసి, తన సాయం ఏమన్నా కావాలా అని అడగటం, ఆయ నేమీ మాట్లాడక, ఆశీర్వదిం చటం భేతాళుడు గమనించాడు. అప్పుడు విక్రమార్కునితో ”ఎప్పుడో చిన్నప్పుడు ఆయన వద్ద చదువుకొని ఉంటావు. ఇప్పుడు నువ్వు చక్రవర్తివి. ఆయ న పాదాలపై పడాలా? నీకంటే ఆ బికారి గొప్పవాడా? ఆయన కు ఏమన్నా కొమ్ములున్నాయా?” అని నిలదీశాడు.
చిరునవ్వు నవ్వుతూ గురువును స్మరించి ”అవును భేతా ళా! గురువుకు కొమ్ములే ఉంటాయి. గురువు అనే మాటలో ఉన్న అ న్ని అక్షరాలకు కొమ్ములున్నాయి కదా” అని సరదాగా అంటూ- ”గురువు అనే స్థానానికి అంతకు మించిన విశేషాలు ఉన్నాయి.
ఆయనకు ఉన్న మొదటి కొమ్ము ‘జ్ఞానం’. లోకంలో జ్ఞానానికి మించిన సంపద లేదని నీకు తెలియదనుకొంటా. అంటే ఆయన సర్వసంపన్నుడు. నా సామ్రాజ్యం, వైభవం శాశ్వతం కాదు. ఎవరైనా ఎప్పుడైనా కొల్లగొట్టవచ్చు. కాని ఆయన ప్రసాదిం చిన జ్ఞానాన్ని ఎవ్వరూ ఎప్పటికీ అపహరించలేరు. అది పంచినకొ ద్దీ పెరిగేదే కాని, తరిగేది కాదు” అన్నాడు.
ఆశ్చర్యపోతున్న భేతాళుడితో మళ్ళీ ”ఆచార్యుని రెండవ కొ మ్ము ‘అనుభవం’. ఇదే జ్ఞానాన్ని విజ్ఞానంగా మారుస్తుంది. కొన్నిసా ర్లు గురువును మించిన జ్ఞానం శిష్యులకు లభించి, గురువును మించిన శిష్యులనిపించుకోవచ్చు. కాని అనుభవం మాత్రం గురు వుకు స్వంతం. ఇది వయసు, విజ్ఞతలను బట్టి వస్తుంది. ఎంత జ్ఞాని అయినా, అనుభవమున్న గురువు ముందు ‘లఘువే’ ఔతాడు”. అన్నాడు విక్రమార్క మహారాజు.
మరింత ఆశ్చర్యపడిన భేతాళునితో విక్రమార్కుడు ”గురువు కున్న మూడవ కొమ్ము’త్యాగం’. తనను నమ్మి వచ్చిన శిష్యులకు తా ను పొందిన జ్ఞాన, విజ్ఞానాలను ధారపోసి, వారి అజ్ఞాన, అహంకా రాలను సహంచి, క్షమించి, ఔదార్యంతో మార్గదర్శనం చేస్తాడు. వారి ఉన్నతికి సోపానమే అవుతాడు. శిష్యుడు తనకు మించి ఎదిగి తే, సంతోషించి, అతని చేతిలో ఓటమికి కూడా మనస్ఫూర్తిగా ఆనం దిస్తాడు. ఎంత ఆధునికత పెరిగినా, గురువైన ఆచార్యుడి స్థానం ఆయనదే. గురువును నొప్పించినా, మనసును గాయపరచినా, భగ వంతుడు కూడా మనల్ని కాపాడలేడు. అయినా నువ్వు ఏ గురువు వద్దా చదువుకోకపోవటం వలన, భయంకరమైన ఈ భేతాళుడిగా చెట్టుకు వ్రేలాడుతూ ఉండిపోయావు. గురువును వేళాకోళం చేయ క, వినయంగా ప్రవర్తించు.” అని చెప్పాడు.
సద్గురు సాయినాథుడు తన గురువు, గురుస్థానం గురించి ఎప్పుడూ తలుచుకుంటూ తన భక్తులకు వివరించే వారు. షిరిడీలో సాయిబాబా మొదటిసారిగా ఓ వేప చెట్టు కింద ధ్యానం చేసుకుం టూ కనిపించారు. ఆ స్థలం తన గురువుకు చెందినదని, ఆ స్థలంపట్ల తనకు ఎంతో అభిమానం ఉందని బాబా చెబుతుండేవారు.
”చండాలోస్తు, సతుద్విజోస్తు, గురు రిత్యేషా, మనీషా మమ” అన్నారు శంకరాచార్య. అంటే ‘జ్ఞానం కలవాడు ఎవరైనా, ఏ కులం వాడైనా నాకు గురువే’ అని అర్ధం.
శ్రీకృష్ణుడు తన గురువు సాందీపని మ#హర్షిని, శ్రీరాముడు వశిష్ట మహర్షిని,స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంసను ఎన్నడూ మర్చిపోలే దు. ఆ గురు గౌరవమే వారి ఔన్నత్యానికి శోభ నిచ్చింది.
”గురువునూ, గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమ స్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందు డు వున్నాడని చెప్పింది గురువే కదా” అంటాడు భక్త కబీర్‌దాస్. అదీ మన భారతీ య సంస్కృతి ఆర్షధర్మం నేర్పి న గురువు ప్రాముఖ్యం. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.