తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం అన్నాభిషేకం ఘనంగా జరిగింది. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 గంటలలోపే ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఉదయం 3 నుంచి 3.30 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఉదయం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. ఉదయం 7.30 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టారు. శుద్ధి అనంతరం ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.