Tuesday, November 19, 2024

గోపికా ‘భ్రమర గీతం’

భాగవతంలో భగవంతుని శరణాగతి పొందుటకు భక్తి నవ విధాలుగా వివరించి బడింది. అందులో ”ఆత్మ నివేదన ఒకటి. మీరాబాయి గోదాదేవి, బలిచక్రవర్తి, సక్కుబాయి వంటి భక్తులు ఆత్మనివేదన ద్వారానే మోక్షాన్ని పొందారు. వ్రేపల్లెలోని గోపికలు కూడా తమతమ ఆత్మలను శ్రీకృష్ణుడుకు సమర్పించి, ప్రతీ వస్తువులోనూ ఆయ న్నే దర్శిస్తూ, ఆయన లీలనే కథలుగా చెప్పుకుంటూ భక్తి పారవశ్యంతో ఉంటున్నారు.
ఒకనాడు శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఉన్న స్థితిలో ”వేపల్లెలోని గోపికలు నామీదనే మనసు లగ్నం చేసుకొన్నారు. నా ఆగమనం కొరకు ఎదురుచూస్తున్నారు. నన్నే ఆత్మలో ధ్యానిస్తారు. కొంతమంది ప్రణయ పారవశ్యంతో తమతమ గృహాలలో అనేక విధాలుగా ‘వగ’ చెందుతూంటారు. నేను వెళ్ళక పోవడంవల్ల ఎంత కినుక వహస్తున్నారో?” అని ఆలోచించాడు.
నిశ్చితమైన భావాలు కలవాడు, గంభీరుడు, వృష్టి వంశస్థులుల్లో ఉత్తముడు, బుద్ధికి గని వంటివాడు, తన అనుయాయుడు, భక్తుడైన ఉద్ధవుడుని పిలిచి ”ఉద్ధవా! ప్రణయ మూర్తులైన గోపికలు నా ఆగమనాన్ని ఎదురుచూస్తూ నా మీద వ్యామోహంతో అన్నీ మర్చిపోయి, ఎంతగా దు:ఖ పడుతున్నారో? లోక ధర్మాలను విడిచి, నాయందు చూపు
నిలిపి, ప్రపత్తి చేసేవారికి, నేను లోబడి దయామయ దృష్టితో వారిని కాపాడతాను. ఆశ్ర యించిన వారిని ఆదుకోవడం నాకు స్వభావ సిద్ధమైన గుణం. కాబట్టి ఆ గోపికలకు నేను బృందావనం వస్తానని, రహస్యంగా వారికి తెలియచేయి.” అని గోపాలుడు వ్రేపల్లె పం పాడు. ఉద్ధవుడు గోకులం చేరి, నందుని ఇంటికి వెళ్ళాడు. నందుడు ఎంతో ఆనందంతో ఆ పుణ్యాత్ముడును ఆలింగనం చేసుకొని, కుశల ప్రశ్నలు అయిన తదుపరి, శ్రీకృష్ణుడు రాక గురించి తెలుసుకొన్నాడు. మరునాడు వేకువనే పెరుగు చిలికే చప్పుడు విని, నిద్ర లేచి,
సంధ్యావందనం, నిత్యానుష్టానం పూర్తి చేసుకొని, ఏకాంత స్థలంలో ఉండగా, గొల్ల కాంతలు అక్కడకు చేరి ”అయ్యా! ఉద్ధవా! మేము నిన్ను ఎరుంగుదుము. నీవు మా నెచ్చెలి శ్రీకృష్ణునికి ఆప్తుడవు. సర్వసంగ పరిత్యాగులైన మునులు కూడా, స్నేహబంధం వదులు కోరు. శ్రీకృష్ణుడు తన జననీ జనకుల క్షేమసమాచారం తెలుసుకుందామని పంపగా వచ్చావు. ఇతరులతో చేసే చెలిమి ఒక ప్రయోజనాన్ని బట్టి ఏర్పడుతుంది. ఆ ప్రయోజనం తీరగానే ఆ స్నేహబంధం కూడా వదిలిపోతుంది. ఆకలి తీరిన తరువాత తుమ్మెదలు పూలను విడచినట్లే!” ఈవిధంగా కొంతమంది గొల్ల పడుచులు పలుకుతూండగా, ఒక గోపిక శ్రీకృష్ణ చరణ ధ్యాస పరవశురాలై, ఆమె తన సమీపంలోని చురుకైన, తెలివితేటలు గలది, పూదోనెను గ్రోలి మత్తెక్కి నట్టిదై, తన మధుర మంజుల ఝూంకార స్వరంతో కాముకలను కలవర పెట్టినది అయిన ఒక గండు తుమ్మెదను చూసిం ది. అలా చూసిన గోపిక తనని వేడుకొనుటకు ప్రియుడు పంపగా వచ్చిన దూతగా భావించి ఉద్ధవునికి అన్యాప దేశంగా తాకునట్లు, ఆ భ్రమరంతో ఇట్లా పలికింది. ”ధూర్త మిత్రుడైన ఓ మధుపా! నీవు మా పాద పద్మాలను స్పృశించ వద్దు. మధురాపుర కాంతల స్తన కుంకుమ అంటుకొన్న మా ప్రాణవల్లభుని వలె, పుష్ప మాలికలోని మకరందాన్ని గ్రోలి ఆ కుంకుమ చేత ఎర్రబడిన ముఖం కలవాడవు కదా! మా శోభనం గృహాలలో నిత్యం స్తుతిం చబడుతున్న, మా పూజలు అందుకొంటున్న అతను మన్నించునేమో? కాని మేము మాత్రం మన్నించము సుమా! ఓయీ! భ్రమరమా! ఒక పువ్వులోని మకరం దాన్ని పానం చేసి దానిని విడిచి ఉత్సాహంతో మరొక పుష్పాన్ని నీవు ఆశ్రయించినట్లు, ఆ శ్రీ కృష్ణుడు తన అధర సుధా రసాన్ని ఒకసారి మమ్ము గ్రోలనిచ్ఛి, మా ¸వ నం దొంగిలించి, అన్యాకాంతాసక్తుడైనాడు. అయ్య య్యో! అతడు ఉత్తమ శ్లోకుడన్న (పురుషుడు) బూటకపు మాటలు మరచి నమ్మి శ్రీ మహాలక్ష్మీ అట్టి చంచల చిత్తునకు వశమైపోయింది. ఓ! భృంగు రాజా! శ్రీకృష్ణుడు మంచివాడని అతనిని ఎంతో సంతోషంతో కీర్తిస్తున్నావు. నీ గానం విని మా గోపికలు అందరూ సొక్కి పాలిపోతా రనుకొన్నావా? అతని కథలు మాకు క్రొత్తా? ఏమి.
ఓ! తుమ్మెద రాయడా! మనోహరుడు అగు శ్రీకృష్ణు ని మందహాసానికి, విధానాలకు, కరిగిపోని కాంతల స్వర్గ- మర్త్య – పాతాళ- భువనములయందు కలరా? లేదు కదా!
అన్నులమిన్న అయిన ఆ లక్ష్మీదేవి అతని చరణ కమలాలను సేవిస్తుండగా ఆ దయాసాగరుని, అను గ్రహం పొందడానికి మేమే సాటి వారము? ఓ! చంచరీ కమా! రాయబారం నడుపుటలో నీవు చాలా గడుసరివి. నీ నేర్పులు ఇక చాలు. మా చరణ పద్మాలను విడిచి పెట్టు. మా భర్తలను, పుత్రాదులను చులకనగా వదిలి, సద్గతి మాట తల పెట్టక, తనతో లీనమై ఉన్న మమ్ము అతడేల పరిత్యజించాడు? గగన తీరంలో ఎగిరిపోతే పక్షులు సైతం, చెవులారా అతని పేరు ఒక్కసారివింటే, ఇల్లు- ఇల్లాలు, పిల్లలను దూరంచేసి, విత్తాధికం దూరంచేసి, సంసార మార్గం దూరం చేసే ఆ శ్రీకృష్ణుడు ఎడతెగని కోరికలతో న్యాయం తప్పకున్న మమ్ము సహస్తాడా? ఓ! భ్రమరమా! చుట్టాలను, సుతులను, భర్త లనూ, అన్నదమ్ములనూ, తల్లిదండ్రులను, కామాంధత్వము చే విడనాడి శ్రీకృష్ణునే శరణు జొచ్చాము. ఇటువంటి మమ్ము విరహ సాగరమున త్రోసివైచి, మా దగ్గరకు రాకుండుట న్యాయం కాదని శ్రీకృష్ణుడుకు పాదప్రమాణంగా గట్టిగా నొక్కి చెప్పు. లక్ష్మీ వల్లభుడైన శ్రీకృష్ణుడుకు మా వాడ గుడెసెలు బంగారం మణులతో నిర్మించిన మేడలా ఏమి? యదు కులమునకు అలంకారమైన మాపల్లెలు రాజులుచే సేవింపబడు ముఖ్య పట్టణమా? ఏమి. సింగము నడుము వంటి నడుము కింద శ్రీహరికి సువాసనలు వీచే చెట్లతో, పూతీగలతో ఉండే ఉద్యానవనమా?
మన్మధుడుకు మన్మధుడైన ఆ వన్నె కానికి గొల్లపడుచులము మేము రూప- విభ్రమ- విలాసములతో ఒప్పారు కాంతామణులమా? ఏమి. కనుక శ్రీకష్ణుడు మా గురించి ఎందు కు ఆలోచిస్తాడు. మమ్ము ఎందుకు స్మరిస్తాడు? లోకంలోని ప్రభువులు నవప్రియులు కదా!” ఇలా నానా రకాలుగా శ్రీకృష్ణ సందర్శనమందు ఆశక్తి కలవారైన గోపికల మాటలు ఉద్ధవుడు విన్నాడు.
ఎంతో శాంతంగా ”ఓ గోపికలారా! శ్రీకృష్ణుడు నన్ను కార్యార్థమై పంపేట ప్పుడు నాకు చెప్పిన మాటలు మీకు వివరిస్తాను. మీ కోసమే ఆయన తపిస్తున్నాడు. అందుకే త్వరలోనే మీ ముంగిటకు వస్తాననే వర్తమానాన్ని మీకు తెలపమన్నాడు.” అంటూ గోపికలను ఊరడించాడు.
అయినా కూడా గోపికలు శ్రీకృష్ణుడు రాక గురించి అలా ఎదురుచూస్తూనే ఉన్నారు. శ్రీకృష్ణుడు ఏ క్షణమైనా రావచ్చునని తమ లోగిళ్ళు, వీధులను రంగురంగుల రంగవల్లికలు, పూలు, పూలతోరణాలతో అలంకరిస్తూనే ఉన్నారు. గోపికలు తుమ్మెదలతో చేసిన సంభాషణ కారణంగా దీనిని ”భ్రమర గీత” అంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement