లంకా పట్టణములో అశోక వనములో శింశుపా వృక్షము నీడలో సీతమ్మ కూర్చుని వుంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు. వారు సీతమ్మ తల్లిని భయపెడుతున్నారు. ఇంతలో త్రిజట (విభీషణుని కుమార్తె) అనే రాక్షస స్త్రీ లేచి అక్కడ వున్న రాక్షస స్త్రీలతో ఇలా పలికింది.
శ్లో|| సీతాం తాభి రనార్యాభి: దృష్ట్వా సంతర్జితాం తధా|
రాక్షసీ త్రిజటా వృద్ధా శయానా వాక్యమబ్రవీత్!!
ఆత్మానం ఖాదతా నార్యాన సీతాం భక్షయిష్యథ|
జనకస్య సుతా మిష్టాం స్నుపాం దశరథస్య చ||
స్వప్నో హృద్యమయా దృష్టో దారుణో రోమహర్షణ:|
రాక్షసానాం అభావాయ భర్తురస్యా జయాయ చ||
”దుష్టులైన వారిచేత భయపెడుతున్న సీతను చూసి వృద్ధురాలైన త్రిజట ఈ వాక్యములను పలికెను. ”జనకుని కూతురు దశరథుని కోడలు అయిన సీతను తినకుడు. మిమ్మల్ని మీరే తినుడు. ఇవాళ నేను ఒక స్వప్నము చూసితిని. అది దారుణము. రోమహర్షణము అయినది. అది ఆమె భర్త జయమును, రాక్షసుల వినాశనమును సూచిస్తున్నది.
”గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగామ్
యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవ:
శుక్లమాల్యాంబరధరో లక్ష్మణన సహాగత:||
స్వప్నే చాద్య మాయ దృష్టా సీతా శుక్లాంబరావృతా|
సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వత మాస్థితా”
”వెయ్యి #హంసలు మోస్తున్న ఒక పల్లకి మీద తెల్లటి వస్త్రములను ధరించి, మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మ ణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. అప్పుడు వారు నాలుగు దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టు పుట్టం కట్టుకుని ఉంది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. అప్పుడు వారు వృషభములు పూన్చిన రథంలోకి మారారు.
ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతి తో నిమిరింది. తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. పాల సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది.
ఆ కొండ మీద హమసింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు. ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాము డు రెండు చేతులతో కనపడలేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలో నుంచి వస్తున్నాయో, ఎవరివల్ల నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమ యిపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు.
ఇంకా ఇలా పలికింది త్రిజట-
”రావణశ్చ మయాదృష్ట: క్షితౌ తైలసముత్‌క్షిత:|
రక్తవాసాక్ష పిబన్మత్త: కరవీర కృత స్రజ:||
విమానాత్ పుష్ప కాదద్య రావణ: పతితో భువి|
కృష్కమాణ స్త్రియా దృష్టో ముండ: కృష్ణాంబర: పున:||
”రక్తపు రంగు వస్త్రములతో తాగి మత్తులో కరవీర పుష్పముల మాల ధరించి, తైలముతో పూయబడి భూమిమీద పడియున్న రావణుని కూడా చూచితిని. శిరోముండనము చేయబడిన నల్లని వస్త్రములు ధరించియున్న రావణుని ఒక స్త్రీ ఈడ్చుకుపోతున్నట్లు, మళ్ళీ రావణుడు విమానము నుంచి భూమిపై పడుతున్నట్లు చూచితిని”
ఇంకా రావణాసురుడు గాడిదలు పూన్చిన రథం ఎక్కి, ఎర్రటి వస్త్రము లు ధరించి, నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయిం ది. కొంతదూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తరువాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చిపిచ్చిగా అరుస్తూ, నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపుకొట్టే మురికి గుంట లో పడిపోయాడు.
అప్పుడు వికటాట్టహాసం చేస్తూ, ఎర్రటి వస్త్రములు ధరించి, బోడి గుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుడిని బయటకి లాగింది. అప్పుడా మె రావణుడిని పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ, నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయా డు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైనవారు ఒంటె, మొసలి మొదలైన వాహనములను ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు.
ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. నలుగురు మంత్రులచేత సేవింపబడుతున్నాడు.
ఎక్కడినుంచో ఒక మహావానరము వచ్చి లంకా పట్టణంలోని ఇళ్ళన్ని టినీ అగ్నికి బలిచేసింది. ఎక్కడ చూసినా ‘ఓ తల్లి! ఓ అక్క! ఓ తండ్రి! ఓ చెల్లి!’ అనే కేకలు వినపడ్డాయి. లంకంతా బూడిదయిపోయింది. నేను అటువంటి కలని చూశాను.
ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. అదుగో నిష్కా రణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది. ఎడమ భుజం అదురుతోంది. ఎడమ తొడ అదురుతోంది.
ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని కూస్తోంది. పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే తన భర్తతో సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కానీ ప్రస్ఫుటంగా శుభశకునము లు ఆవిడ శరీరమునందు కనపడుతున్నాయి.
రాక్షసులారా! జనకాత్మజ అయిన ఈ మైథిలి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీ క్రూర వచనములు కట్టిపెట్టండి. మీరు బ్రతకాలి అనుకుంటే, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలనుకుంటే, మీ మీదకి రామ బాణాలు పడకుండా ఉండాలం టే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు సాష్టాంగ ప్రణామం చెయ్యండి. శరణు వేడండి. ఆమె ప్రసన్నురాలై మనలను రక్షిస్తుంది. తప్పకుండా క్షమిస్తుంది’ ‘ అని త్రిజట చెప్పింది.
ఈవిధంగా త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం విన్న ఆ రాక్షస స్త్రీలు శాంతించారు.
త్రిజట చెప్పినట్లుగా సీతమ్మను నిందించడం మాని శాంతించారు. ఆమెకు నమస్కరించి, చింతనలను మాని నిద్రపోయారు.
(ఆధ్యాత్మ రామాయణము నుండి)
– అంజనీదేవి