Saturday, November 23, 2024

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

తిరుపతి : శ్రీనివాసమంగపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి :
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.

కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్‌ చెంగ‌ల్రాయులు, కంకణభట్టార్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement