గీతాజయంతి గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
మార్గశీర్ష శుద్ధ ఏకాదశిని గీతాజయంతిగా ఆచరిస్తున్నాము. లౌకిక భాషలో ఆరోజు భగవద్గీత పుట్టినరోజు కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేశాడని మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదవరోజు ”ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ: మామాకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ” అని దృతరాష్ట్రుడు ప్రశ్నించాడు. యుద్ధమునకు తలపడిన నావాళ్ళు అయిన కౌరవులు పాండవులు యేమి చేశారని అర్ధం. వ్యాసభగవానుడు ఇచ్చిన ‘యుద్ధరంగమును ప్రత్యక్షముగా చూచుట’ అను వరము వలన జరిగినదంతా చూసి సంజయుడు ధృతరాష్ట్రునకు వివరించినాడు. ఆ సందర్భముననే భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు వివరించిచాడు. ఆ విధంగా ఆరోజు గీత లోకమునకు వెలువడింది. అందువలన గీతాజయంతిగా మనం ఆనాడు జరుపుకుంటున్నాము.
భగవద్గీత భగవానుడు స్వయముగా చెప్పినది. ‘గీతా సుగీతాకర్తవ్యా కిమన్యై: శాస్త్రసంగ్రహై: యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిర్గతా’ అనునది గీతా ప్రశస్తి. ఒక భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు, ఇతర శాస్త్రాభ్యాసాలెందుకు, ఆ గీత పద్మనాభుని ముఖ పద్మము నుండి వెలువడినది అని భావము. అసలు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశమును చేసిన కారణం ఏమనగా
ఆస్థాన స్నేహకారుణ్య ధర్మాధర్మధియాకులం పార్ధం
ప్రపన్న ముద్ధిశ్య గీతా శాస్త్రం ప్రవర్తితమ్
అనగా ఉండకూడని చోట చూపకూడని చోట స్నేహమును కరుణ చూపుచున్నాడు అర్జునుడు. ధర్మాన్ని అధర్మముగా, అధర్మాన్ని ధర్మముగా భావించి అన్యదా జ్ఞానముతో విపరీత జ్ఞానముతో అనగా ఒక దాన్ని ఇంకోదానిగా భావించి కలత చెందిన బుద్ధితో నున్న అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ”శిష్యస్తేహం శాధిమాల త్వాం ప్రపన్నం” అని శరణు వేడ గా గీతాశాస్త్రమును ప్రవర్తింపచేశాడు.
గీతా శాస్త్రమును ప్రధానముగా బోధించు తత్త్వము శరీరాత్మ విజ్ఞానము అనగా శరీరము చేసే పనితో ఆత్మకు సంబంధము లేదు. శరీరము చేసేదాన్ని ఆత్మ చేసినది అనుకోవటమే అహంకారము. శరీరమునకు కావలసిన వారిని ఆత్మకు కావలసి నవారిగా భావించుట మమకారము. సంసారమనే సర్పానికి అహంకారమమకారములు రెండు కోరలు లాంటివి. రెండు కోరలు తీసేస్తే పాము కాటు వేయదు. అహంకారమమకారములను వదిలివేస్తే సంసారమును చేయజాలము కార్యాలు చేస్తున్నది నేను కాదు, భగవానుడు అని భావించాలి.
‘ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దాణ అర్జున తిష్ఠతి| భ్రామయన్సర్వ భూతాని యంత్రారూఢాని మాయయా||’ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ప్రతిప్రాణి హృదయమున పరమాత్మ ఉన్నాడు. తన సంకల్పముతో సకల భూతములను యంత్రములపై ఉన్నవానిని తిప్పుతున్నాడు. ఈ విధంగా అందరి చేత అన్ని పనులను చేయించువాడతడే అన్ని ఫలితములను పొందువాడు అతడే. అందుకే స్వామి నాకు కర్మ చేయుటలోనే అధికారము, ఫలముల యందు కాదు అన్నాడు. అన్ని పనులు చేయుచున్నది శరీరము కానీ శరీరమునకే ఫలము ఉండదు. తృప్తి, సంతోషము, అనుభూతి, మనస్సునకు బుద్ధికి ఇంకా చెప్పాలంటే భావనతో ఆత్మకు అవేమీ పని చేయుట లేదే. పని చేస్తున్నదానికి ఫలితం రావటం లేదు. ఫలితం పొందుచున్నవి పని చేయుట లేదు, ఇది యదార్ధజ్ఞానము. ఇది కలిగిన నాడు శోకము, దు:ఖము, సంతోషము కలుగవు. అన్ని ఫలితాలు పరమాత్మవే అన్ని కర్మలు చేయించేవాడే పరమాత్మ. అతను చేయిస్తున్నాడు, దీనికి మన శరీరము సాధనము. గరిట పాయసంలో తిప్పినా మరే పదార్థంలో తిప్పినా తిరగటమే దాని పని కాని ఇది తియ్యగా ఉంది ఇది కారంగా ఉన్నది అని అనుకోదు. పాయసంలో గరిటలా సంసారంలో జీవుడు తిరుగుచున్నాడు, అతనికి కష్టము లేదు సుఖము లేదని తెలియాలి. నిత్యము కార్యశీలివి కావాలి ఫలశీలికాదు. పని నీవు చేయాలి ఫలమును నాకర్పించాలి. ఫలము నాకర్పించిన నాడు పుణ్యము పాపము నీది కాదు. స్వర్గము, నరకము నీకు రాదు. నాలోకమే పరమపదమే లభిస్తుంది. స్వార్థాన్ని వదిలిపట్టి పరార్థాన్ని, పరమార్థాన్ని భావించిన నాడు సుఖదు:ఖాలు, రాగద్వేషాలు, ఆశాపాశాలు, లాభనష్టాలు యేమీ ఉండవు. ఇవేమీకానపుడు సంతోషం యెందుకు ? విచారం యెందుకు? స్థిర చిత్తముతో, స్థిర ప్రజ్ఞుడవై వ్యవహరించుము నన్ను శరణువేడుము. ఫలాన్ని ఇచ్చేవాణ్ణి, పనిచేయించేవాణ్ణి నేనే నీ యోగక్షేమములను నేను వహిస్తాను అని సందేశం ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది గీతాసారము.
గీతను సరియైన గురువుల వద్ద అధ్యయనం చేస్తే ఇది చక ్కని వ్యక్తిత్వ వికాసమును కలిగిస్తుంది అందరిలోను పరమాత్మ ఉన్నాడు అని తెలిసిననాడు ఎవరినీ ద్వేషించక అందరినీ ప్రేమిస్తాము. ఇది విశ్వప్రేమ, లోకకళ్యాణము. గీతను అర్థముతో చదివేవారు వీలుకాకుంటే ఒక మూలమే చదవండి. గాంధీజీ విజయానికి అహింసా మార్గానికి ఆధారం గీతే. వివేకానందుని విశ్వ విజయానికి మూలము గీతే. వల్లభాయ్ పటేల్‌ను ఉక్కు మనిషిని చేసింది, లాల్ బహుదూర్ శాస్త్రిని ‘జై జవాన్ జై కిసాన్’ అనిపించినది గీతే. అహింసామార్గం, శాంతి మార్గానికి నిర్వచనం చెపునది గీతే. భారత ప్రథమ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ జేబులో గీతే ఉండేది. గీత జేబులో ఉండాలి మనలో ఉండాలి బుద్ధిలో ఉండాలి అప్పడు రోజూ ఒక శ్లోకమైనా చదువుతాము. గీత చెప్పిన వాటిలో ఒక్కటైనా ఆచరిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఈనాటి నుండి ఆచరించాలి. ఇదే భారతీయ గీతకు చేయు నిజమైన నిస్వార్థమైన ఆరాధన.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి
—-