Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 51, 52,53
51.
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో
ధృత్యాత్మానం నియమ్య చ |
శబ్దాదీన్‌ విషయాన్‌ త్యక్త్వా
రాగద్వేషౌ వ్యుదస్య చ ||

52.
వివిక్తసేవీ లఘ్వాశీ
యతవాక్కాయమానస: |
ధ్యానయోగపరో నిత్యం
వైరాగ్యం సముపాశ్రిత: ||

53.
అహంకారం బలం దర్పం
కామం క్రోధం పరిగ్రహమ్‌ |
విముచ్య నిర్మమ: శాంతో
బ్రహ్మభూయాయ కల్పతే ||

51-53 తాత్పర్యము : బుద్ధిచే పవిత్రుడైనందునను మరియు రాగద్వేషముల నుండి విడివడియున్న కారణముగా ఇంద్రియార్థములను త్యజించి ధృఢనిశ్చయముచే మనో నిగ్రహు కలిగి యున్నందునను ఏకాంత స్థానమున వసించువాడును, మితాహారము చేయువాడును, మనోవాక్కాయములను ని యంత్రించిన వాడును, సమాధిస్థితి యందున్నవాడును, అసంగుడును, మిథ్యాహంకారము, మిథ్యాబలము, మిథ్యాగర్వము, కామము, క్రోధము, విషయవస్తు స్వీకారము అనువాని నుండి విడివడిన వాడును, మమత్వదూరుడును, శాంతిమయుడును అగు మనుజుడు నిశ్చయముగా ఆత్మానుభవ స్థాయికి ఉద్ధరింపబడగలడు.

భాష్యము : విశుద్ధమైన బుద్ధి కలవాడు సత్త్వ గుణములో నుండుటకు ప్రయత్నించును. ఆ విధముగా మనస్సును నిగ్రహించుటచే ధ్యానము సాధ్యపడును. అంతేకాక ఇంద్రియ భోగ వస్తువుల పట్ల ఆసక్తిని కలిగి ఉండడు. తాను చేయు కార్యముల పట్ల రాగ ద్వేషమును కలిగి ఉండడు. అటువంటి వ్యక్తి సహజముగానే ఏకాంత వాసమును కోరుకొనును. ‘నేనే ఈ శరీరం’ అను భావనలేని కారణముగా దానిని బలముగా ఉంచుటకు అనవసరముగా తినుటగానీ, భౌతికమైన వాటి ని సేకరించుట గానీ చేయడు. అంతే కాక తన ఇంద్రియ తృప్తికి ఆటంకములు కలుగుచున్నవని కోపమునూ తెచ్చుకోడు. ఈ విధముగా అహంకారము వీడి, భౌతిక వస్తువుల పట్ల ఆసక్తిని కోల్పోయి ఆత్మ సాక్షాత్కార స్థితి యైన ‘బ్రహ్మ భూత’ స్థితికి చేరుకొనును. ఆ విధముగా భౌతిక భావన నుండి దూరమైన వ్యక్తి కలత చెందక శాంతిని పొందును.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement