Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 34

మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్త్వైవమ్‌
ఆత్మానం మత్పరాయణ :

తాత్పర్యము : నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము నాకు నమస్కారము చేయుము, నన్ను అర్చింపుము.ఈ విధముగా నా యందు సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు.

భాష్యము : ఈ శ్లోకములో కృష్ణ చైతన్యము ద్వారా మాత్రమే మనము భౌతిక ప్రపంచపు కలుషితాల నుండి విముక్తులము కాగలమని నిర్ధారింపబడినది. కాని కొన్ని సార్లు వక్రభాష్యము చెప్పువారు, ‘మనము పూజింపవలసినది కృష్ణున్ని కాదు’ అని తికమక పెడుతూ ఉంటారు. శ్రీ కృష్ణుడు మనలా ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన పరమ సత్యము, కాబట్టి ఆయనకు, ఆయన మనస్సుకు ఎటువంటి భేదమూ లేదు. మనము కంసుని వలె ద్వేషముతో కృష్ణున్ని స్మరించకూడదు. భక్తితో స్మరించినంతనే ఆయన శరీరము భౌతికము కాదని సచ్చిదానంద విగ్రహమని మనము అర్ధము చేసుకొనవచ్చును.

భారత దేశములో వందలాది శ్రీకృష్ణ మందిరాలు ఉన్నాయి. అక్కడ భక్తిని పాటిస్తూ ఉంటారు. మనము శ్రీ కృష్ణునికి ప్రణామాలు అర్పించాలి. మనము మన మనస్సు, శరీరము, కార్యాలను ఇలా సర్వాన్ని ఆయనకు అర్పించాలి. ఆ భావన కృష్ణుని పట్ల ఏకాగ్ర చిత్తముతో మనస్సు లగ్నమయ్యేటట్లు చేస్తుంది. ఈ విధముగా శ్రవణ కీర్తనాదులతో మొదలుగా నవ విధ భక్తితో నియుక్తులవ్వాలి. శుద్ధ భక్తి అనేది మానవ సమాజము పొందగల అత్యున్నత బహుమానము.

- Advertisement -

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమోధ్యాయ: ||

Advertisement

తాజా వార్తలు

Advertisement