Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 30

అపి చేత్‌ సుదుచారో
భజతే మామనన్యభాక్‌ |
సాధురేవ స మంతవ్య:
సమ్యగ్వ్యవసితో హి స: ||

తాత్పర్యము : మిక్కిలి హేయమైన కార్యము నొనరించి నప్పటికి మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడై యున్నచో, తన సంకల్పమున స్థిరనిశ్చయుడై యున్నందున అతనిని సాధువుగనే పరిగణింపవలెను.

భాష్యము : ఎప్పుడైనా భక్తుడు అనుకోకుండా సాధువుగా ప్రవర్తించనంత మాత్రాన అతడిని పతితుడిగా భావించరాదు. భక్తి యొక్క అమోఘమైన శక్తి చేత అతి త్వరలోనే అతడు తిరిగి నిలదొక్కుకుంటాడు. కాబట్టి తొందరపడి మనము భక్తులను దూషించినట్లయితే మనము భగవంతుడు ఇక్కడ ఇస్తున్న ఆజ్ఞను ఉల్లంఘించిన వారమవుతాము. అలా అని భక్తులైనవారు ఏది చేసినా చెల్లుతుంది అని దీని భావము కాదు. భక్తి చేయుట అనగా మాయపై యుద్ధాన్ని ప్రకటించినట్లు, అప్పుడప్పుడు పూర్వపు భౌతిక వాసనల వలన భక్తుడు మాయలో పడిపోయే అవకాశము ఉన్నది. అయితే అన్ని విధాలా సన్నద్ధుడైన భక్తుడు అలా మాయలో పడిపోయే ఆస్కారమే లేదు. ఈ శ్లోకాన్ని ఆసరాగా తీసుకుని చెడు అలవాట్లను తరుచూ చేస్తున్నట్లయితే అతడు భక్తుడుగా భావింపబడడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement