అధ్యాయం 9, శ్లోకం 25
25.
యాంతి దేవవ్రతా దేవాన్
పి తౄన్ యాంతి పితృవ్రతా: |
భూతాని యాంతి భూతేజ్యా
యాంతి మద్యాజినో పి మామ్ ||
తాత్పర్యము : దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత, ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కాని నన్ను పూజించవారు నాతోనే నివసింతురు.
భాష్యము : వేదాల యొక్క కర్మ కాండ విభాగములో అనేక రకాల దేవతా పూజలను గురించి తెలియజేయడమైనది. వారికి కృష్ణుని లోకాల గురించి తెలియకపోవుట వలన, వేరు వేరు ఉపాసనలను చేసి ఆయా దేవతల లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చుదురు. అనగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోవుదురు. అందువలన ఉన్నత అవకాశము ఉండి కూడా వారు ఈ భౌతిక లోకములలోకే పతనము చెందుదురు. కాబట్టి కృష్ణ చైతన్య ఉధ్యమము, హరే కృష్ణ మంత్రమును జపించి భగవద్రాజ్యానికి తిరిగి వెళ్ళే బృహద్మార్గాన్ని సర్వ మానవాళికీ అందజేస్తూ ఉన్నది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..