అధ్యాయం 9, శ్లోకం 14
14.
సతతం కీర్తయంతో మాం
యతంతశ్చ ధృఢవ్రతా |
నమస్యంతశ్చ మాం భక్త్యా
నిత్యయుక్తా ఉపాసతే ||
తాత్పర్యము : ఈ మహాత్ముల దృఢనిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు, నాకు నమస్కారమెసగుచు, నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు.
భాష్యము : ఒక సామాన్య వ్యక్తిని మహాత్ముడిగా కీర్తించి నంత మాత్రాన అతడు మహాత్ముడు కాబోడు. ఈ శ్లోకములో నిజమైన మహాత్ముడి యొక్క లక్షణాలు వివరింపబడినవి. ముఖ్యముగా అతడు దేవాదిదేవుడైన శ్రీ కృష్ణున్ని ఎల్లప్పుడూ కీర్తించుచూ ఉండును. కీర్తన అనగా ఆయన గొప్పతనాన్ని గుర్తించుట, నామము యొక్క మహిమను వర్ణించుట, ఆయన దివ్య మంగళ రూపాన్ని, గుణ గణాలను, లీలలను అభినందించుట. ఆ విధముగా కీర్తించినప్పుడు మాత్రమే అది ‘ కీర్తన’ అనబడును. కాబట్టి మహాత్ముడు అనగా భగవంతుని పట్ల అనురక్తి కలిగిన వ్యక్తి అని అర్ధమవుతుంది. భగవత్సేవ అనేది ఎంతో ఉల్లాసముతో చేసేది. దీనికి కఠోర నిష్టలు, తపస్సులు చేయవలసిన అవసరము లేదు. దక్షత కలిగిన గురువు యొక్క మార్గదర్శకత్వములో భక్తిని పాటిస్తూ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసిగా ఏ ఆశ్రమములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రపంపచములో ఏ భాగము నందు ఉన్నా భగవద్భక్తిని కొనసాగించి మహాత్ముడుగా ఎదగవచ్చును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..