Thursday, November 14, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 22

22.
పురుష: స పర: పార్థ
భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాంత:స్థాని భూతాని
యేన సర్వమిదం తతమ్‌ ||

తాత్పర్యము : సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపియై యున్నాడు మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగియున్నది.

భాష్యము : ఈ శ్లోకము నందు అత్యున్నత ధామము, మనము మరలా తిరిగి రాని ధామము శ్రీకృష్ణుని ధామమేనని స్పష్టపరుచబడినది. శ్రీకృష్ణుడు తన ధామములోనే ఉంటూ తన ఆధ్యాత్మిక, భౌతిక శక్తుల ద్వారా సర్వత్రా విస్తరించియున్నాడు. తన ధామము ఆధ్యాత్మిక శక్తితో ఆనంద చిన్మయ రసముతో నిండి ఉంటుంది. అక్కడ ఏదియునూ భౌతికము కాక ఆధ్యాత్మిక ఆనంద లక్షణాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఏడవ అధ్యాయములో చెప్పుకున్నట్లు భగవంతుని ఆధీనములోనే భౌతిక శక్తి ద్వారా ఈ జగత్తు అంతా నడపబడుతుంది. ఈవిధముగా తన ధామములోనే ఉంటూ తన ఆధ్యాత్మిక భౌతిక శక్తుల ద్వారా ఆధ్యాత్మిక భౌతిక జగత్తులంతా విస్తరించి యున్నాడు. దీనిని బ్రహ్మసంహిత, గోపాల తపని ఉపనిషత్తు, శ్వేత శ్వతర ఉపనిష్తులు బలముగా సమర్ధిస్తూ ఉన్నాయి. అయితే ఈ శ్లోకములో తెలుపబడినట్లు ‘భక్త్యా’ – భక్తి ద్వారా మాత్రమే మనము కృష్ణుని ధామమునకు గాని, ఏదేని వైకుంఠలోకములకు గాని వెళ్ళగలము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement