అధ్యాయం 8, శ్లోకం 13
13.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
వ్యాహరన్ మామనుస్మరన్ |
య: ప్రయాతి త్యజన్ దేహం
స యాతి పరమాం గతిమ్ ||
తాత్పర్యము : ఈ యోగావిధానము నందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు.
భాష్యము : ఇక్కడ స్పష్టముగా తెలియజేయబడినదేమిటంటే ‘ఓం’, బ్రహ్మము మరియు శ్రీకృష్ణుడు వేరు కాదు అని. కృష్ణుని నిరాకార శబ్ధరూపమే ‘ఓం’. కానీ హరే కృష్ణమంత్రము ‘ఓం’ ను కూడా కలిగి ఉంటుంది కనుక ఈ యుగ ధర్మమైన ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే ‘ స్మరిస్తూ ఎవరైతే శరీరాన్ని వదులుతారో వారు వారి వారి భావాలను బట్టి గోలోకవృందావనమైన కృష్ణలోకానికిగానీ, మిగిలిన విష్ణు రూపాలను స్మరించిన వైకుంఠ లోకాలకు గానీ వెళ్లుదురు. ఇక నిరాకార వాదులు బ్రహ్మజ్యోతి నందే ఉండిపోవుదురు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..