Wednesday, November 20, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 11

11.
యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగా: |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ||

తాత్పర్యము : వేదవిదులైనవారు, ఓంకారమును ఉచ్చరించువారును, సన్యాసాశ్రమము నందున్న మహర్షులును అగు మనుజులు బ్రహ్మము నందు ప్రవేవించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరినవారు బ్రహ్మచర్యవ్రతమును అభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానమును ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును.

భాష్యము : శ్రీకృష్ణుడు అర్జునునికి షట్చక్ర యోగా పద్ధతి ద్వారా భృకుటి వద్ద ప్రాణవాయువుని నిలుపమని సూచించి ఉన్నాడు. ఇప్పుడు కొన్ని శ్లోకాలలో ఆ పద్ధతిని వివరించునున్నాడు. బ్రహ్మమునకు అనేక రూపములు, లక్షణములు ఉన్నవని భగవంతుడు తెలియజేయుచున్నాడు. నిరాకారవాదులకు అక్షరము లేదా ‘ఓం’ కారము బ్రహ్మముతో సమానము. శ్రీకృష్ణుడు సన్యాసులు చేరు నిరాకార బ్రహ్మము గురించి వివరించుచున్నాడు. పూర్వము శిష్యులు గురుకులమున గురువును సేవిస్తూ వేదవాజ్ఞ్మయమును నేర్చుకునేవారు. వారు మొదటి నుండీ బరహ్మచర్యమును పాటించుచూ, ‘ఓం’ కార ఉచ్చారణను అభ్యాసము చేయుచూ నిరాకార బ్రహ్మము గురించి అధ్యయనము చేసెడివారు. ఈరోజున అటువంటి విద్యాలయము గాని, బ్రహ్మచర్యమును పాటించు అవకాశము గాని లేకుండా పోయినది. బ్రహ్మచర్యము పాటించకుండా ఆధ్యాత్మిక జీవితములో పురోగమించుట దుర్లభము. కాబట్టి శ్రీచైతన్య మహాప్రభు శాస్త్రానుసారము కలియుగమున ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే ‘మంత్ర జపము కంటే వేరు మార్గము లేదని నిర్ధారించెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement