అధ్యాయం 8, శ్లోకం 4
4.
అధిభూతం క్షరో భావ:
పురుషశ్చాధిదైవతమ్ ||
అధియజ్ఞో హమేవాత్ర
దేహే దేహభృతాం వర ||
తాత్పర్యము : ఓ దేహధారులలో శ్రేష్ఠుడా! నిరంతరము పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతమనబడును. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండెడి విశ్వరూపమే అధిదైవతమనబడును. దేహధారుల హృదయములో పరమాత్మ రూపమున నిలిచియుండెడి దేవదేవయుండెడి దేవదేవదేవుడనైన నేనే అధియజ్ఞుడను.
భాష్యము : ‘అధిభూతము’ అనగా ఈ భౌతిక స్వభావము. ఇది శాశ్వతముగా మారుతూ ఉంటుంది. పుట్టుట, పెరుగుట, కొనసాగుట, ఉత్పత్తి చేయుట, క్షీణించుట, నశించుట అను ఆరు పరిణామాలకు గురి అవుతూ ఉంటుంది. ఈవిధముగా ఆది, అంతములను కలిగి ఉంటుంది. విశ్వరూపము లేదా విరాట్ రూపమునే ‘అధి దైవతము’ అందురు. ఇందు దేవతలూ వారి లోకాలు సైతమూ భాగములే. ఇక హృదయము నందుండు పరమాత్మనే ‘అధియజ్ఞుడు’ అని అందురు, ఇతడు భగవంతుడి కంటే భిన్నుడు కాడు. దీనిని తెలియజేయుటకు ‘చ’ అనే పదాన్ని వాడటం జరిగినది. భగవంతుని భక్తుడికి పరమాత్మ యొక్క కార్యాలన్నీ సునాయాసముగా అర్థమగును, అట్లు అర్థము కానివారు విరాట రూపము ద్వారా పరమాత్మను ధ్యానించుదురు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..