అధ్యాయం 8, శ్లోకం 3
3.
శ్రీ భగవాన్ ఉవాచ
అక్షరం బ్రహ్మ పరమం
స్వభావో ధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో
విసర్గ: కర్మసం జ్ఞిత: ||
తాత్పర్యము : శ్రీకృష్ణభగవానుడు పలికెను : నాశరహితము, దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్యస్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము అనబడును.
భాష్యము : బ్రహ్మము నశింపనిదై, శాశ్వతముగా ఉనికిని కలిగి ఉండి, దాని స్వభావము ఎప్పటికీ మారనట్టిదై ఉంటుంది. బ్రహ్మము జీవుని సూచిస్తే, పరబ్రహ్మము భగవంతుణ్ని సూచిస్తుంది. జీవుడు భగవంతుని యొక్క తటస్థ శక్తికి సంబంధించినవాడు అనగా అతడు అంతరంగ శక్తియైన ఆధ్యాత్మిక శక్తి ఆధీనములో ఉంటే తన సహజ శాశ్వత స్వభావాన్ని కలిగి పరబ్రహ్మమును సేవిస్తూ ఉంటాడు. అట్లుకాక బహిరంగశక్తి మాయలో పడిపోతే భౌతిక మనస్సు, ఇంద్రియాలను కలిగి ఏదో ఒక శరీరాన్ని పొందుతాడు. యజ్ఞాలను చేసి స్వర్గాన్ని పొంది, పుణ్యము తరిగినంతనే భూలోకములో మానవుడుగా జన్మించి మరలా మరలా వేరు వేరు లోకాలను, శరీరాలను పొందుతూ ఉంటాడు. ఈ ప్రక్రియనే ‘కర్మ’ అందురు. భక్తుడు భగవద్భక్తి వలన వేరు వేరు భౌతిక శరీరాలను పొందక శాశ్వత స్వభావమైన ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది భగవద్దామానికి చేరుకుంటాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..