Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 66
66.
సర్వధర్మాన్‌ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచ: ||

తాత్పర్యము : సర్వవిధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. నిన్ను సర్వ పాపఫలముల నుండి నేను ముక్తిని గావింతును. భయము నొందకుము.

భాష్యము : శ్రీకృష్ణుడు భగవద్గీతలో అనేక రకాల జ్ఞానమును, వాటిని పఠించు పద్ధతిని వివరించియున్నాడు. ఇప్పుడు భగవద్గీత సారముగా ఇంతకు ముందు చెప్పిన వాటినన్నింటినీ ప్రక్కకు పెట్టి శ్రీకృష్ణునికి శర ణు పొందమని సూచిస్తున్నాడు. అంతేకాక అన్ని పాపముల నుండి విముక్తిని కూడా పొందగలడని తాను స్వయముగా రక్షిస్తానని మాట ఇచ్చుచున్నాడు. పాపముల వీడిన వ్యక్తి మాత్రమే ధృఢముగా భక్తి చేయగలడని ఏడవ అధ్యాయమున వివరించటమైనది. అయితే శ్రీకృష్ణున్ని శరణు పొందిన వ్యక్తి సహజముగానే పాపముల నుండి విముక్తుడగును.

వర్ణము మరియు ఆశ్రమములను బట్టి అనేక ధర్మములను చేయవలసి ఉంటుంది. అటువంటి ధర్మములన్నీ చివరకు భగవద్భక్తికి దారి తీయవలెను. లేకున్నట్లయితే ఆ ధర్మములు ఎంత నిష్ఠతో నిర్వహి ంచినా ఫలితము శూన్యము. కృష్ణ చైతన్యమునకు దారి తీయని ఏ ధర్మమునైనా విడనాడవలెను. మన పోషణ గురించి గాని, మిగిలిన వాటి గురించి గాని సంకోచించవలసిన అవసరము లేదు. శ్రీకృష్ణుడు అన్ని సందర్భాలలోనూ వెన్నంటి ఉండి కష్టాలను దాటేటట్లు చేస్తాడు. కాబట్టి శరణాగతి కాక వేరే పద్ధతులను పాటించి సమయమును వృథా చేయరాదు.

‘కృష్ణ’ అనగా సర్వాకర్షకుడని అర్థము. ఆయన పట్ల ఆకర్షితులైన వారు, బ్ఱహ్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఇంకా చెప్పాలంటే భగవద్విజ్ఞానమును పొందిన వారి కంటే శ్రేష్ఠులు. అటువంటి సంపూర్ణ కృష్ణ చైతన్యముతో చేయు భగవద్భక్తి అత్యంత గుహ్యతమ జ్ఞానము మరియు భగవద్గీతా సారము. చివరిగా ‘మా సుచ: ‘ అను పదము చాలా ముఖ్యమైనది. అనగా ‘భయపడ వద్దు, సంకోచించ వద్దు, చింతించ వద్దు”. మిగిలిన ధర్మాలన్ని వదిలివేసి కేవలము శ్రీకృష్ణునికి శరణాగతి పొందితే సరిపోతుందా? అని ఎవరైనా సంకోచించవచ్చు. అటువంటి ఆందోళన చెందవలసిన అవసరము లేదని ఈ పదం ద్వారా నొక్కి వక్కాణించటమైనది.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement