Tuesday, November 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 11
11.
న హి దేహభృతా శక్యం
త్యక్తుం కర్మాణ్యశేషత: |
యస్తు కర్మఫలత్యాగీ
స త్యాగీత్యభి ధీయతే ||

తాత్పర్యము : దేహధారుడైనవానికి సర్వకర్మలను త్యజించుట నిక్కముగా అసాధ్యమైన విషయము. కాని కర్మఫలములను త్యాగమొనర్చినవాడు మాత్రము నిజమైన త్యాగి అనబడును.

భాష్యము : మనుజుడు ఏ సమయమునకు కర్మను త్యజింపజాలడని భగవద్గీతయందే తలుపబడినది. కనుక కృష్ణుని కొరకే కర్మనొనరించుచు, కర్మ ఫలమును తాను అనుభవింపక కృష్ణునికే సమస్తమును అర్పించువాడు నిజమైన త్యాగి అనబడును. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము నందు సభ్యులైన పలువులు తమ కార్యాలయముల యందు గాని, కర్మాగారమునందు గాని, ఇతర చోట్ల గాని కష్టించి పని చేసినను వారు సంపాదించినదంతయు సంస్థకే ఒసగుదురు. అట్టి మహాత్ములు వాస్తవముగా సన్యాసులైనట్టివారే. అనగా వారు సన్యాసాశ్రమము నందు నెలకొని యున్నట్టి వారే. కర్మ ఫలములను ఏ విధంగా త్యాగముచేయవలెనో మరియు ఎట్టి ప్రయోజనమునకై కర్మ ఫలములను విడువవలెనో ఈ శ్లోకమున స్పష్టపరచబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement