Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో….)

అధ్యాయం 7, శ్లోకం 19

బహూనాం జన్మనామంతే
జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే |
వాసుదేవ: సర్వమితి
స మహాత్మా సుదుర్లభ: ||
తాత్పర్యము : తాత్పర్యము : జ్ఞానవంతుడైనవాడు బహు జన్మమృత్యువలు పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలసికొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు.

భాష్యము : ఆధ్యాత్మిక జీవితమును ఆరంభించినపుడు, ఏదో ఒక తంతు వలే, దినచర్యలు, ఆధ్మాత్మిక నియమాలను, సాధనలను ఆచరించడం జరుగుతుంది. ఇలా కొన్ని జన్మలు కొనసాగించిన తరువాత భగవంతున్ని సాక్షాత్కరించుకోవటమే వీటి లక్ష్యమని అర్థమవుతుంది. ఈవిధముగా మొదటి దశలలో భౌతిక బంధనాలను తొలగించుకోవాలని ప్రయత్నించినపుడు, వైరాగ్యముతో అన్నింటిని వదిలి వేస్తే బాగుంటుంది అని తోచవచ్చును. అయితే ఇంకా కొంత పురోగతి సాధించినప్పుడు ఆధ్యాత్మిక జీవితమంటే అనేక కార్యాలుంటాయని వాటినే భగవత్సేవ అంటారని అర్థమవుతుంది. ఈ భౌతిక ప్రపంచము భగవంతునిపై ఆధారపడి ఉంటుందని, ప్రతి దానికి, ప్రతి పరిస్థితికి కృష్ణునితో సంబంధాన్ని పెంచే అవకాశము ఉంటుంది అని గ్రహించి దేనినీ నిరసించడు. ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబమనే విషయాన్ని ప్రతి దానినీ వాసుదేవుని సంబంధంగా చూసి ఇంతకు మించీ ఇక
ఏమి లేదని ఆయనకు శరణగతుడవుతాడు. అట్టి మహాత్ముడు చాలా అరుదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement