Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 14

దైవీ హ్యేషా గుణమయీ
మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యంతే
మాయామేతాం తరంతి తే ||

తాత్పర్యము : త్రిగుణాత్మకమైన నా ఈ దైవీమాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కాని నన్ను శరణుజొచ్చినవారు దీనిని సులభముగా దాటగలరు.

భాష్యము : భగవంతునికి అనేక శక్తులున్నాయి, అవన్నియూ దివ్యమైనవే. జీవుడు కూడా అటువంటి శక్తికే చెంది ఉన్నా, భౌతిక శక్తి సంపర్కములోనికి వచ్చి బద్ధుడగుటచే తన ఉన్నతస్థితి కప్పివేయబడుతుంది. అయితే భౌతిక శక్తి కృష్ణుని ఆధీనములో ఉండుట వలన ఆయన ఆజ్ఞ చేత మాత్రమే బద్ధ జీవికి ముక్తి లభించే అవకాశమున్నది. ‘గుణ’ అనగా త్రాడు అనికూడా అర్థము. త్రాడుతో బంధీ అయి ఉన్న వ్యక్తి తనకు తానుగా విడిపించుకోలేడు. కాబట్టి ముక్తుడై ఉన్నట్టి కృష్ణుడు గాని లేదా ఆయన ప్రతినిధియైన గురువు మాత్రమే రక్షించగలడు. కాబట్టి కృష్ణుని పాదాలకు శరణు జొచ్చినట్లైతేనే ఆయన కృపద్వారా కఠినమైన భౌతిక ప్రకృతి బంధనము నుండి బయటపడగలుగుతాము. ‘మామేకం’ అనగా కేవలము కృష్ణుడు లేదా విష్ణువు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు. గొప్ప దేవతలైన బ్రహ్మ, శివునికి సైతమూ ఇది సాధ్యము కాదు. దీనిని శివుడే స్వయంగా ఇలా వ్యక్తపరచినాడు: ముక్తిప్రదాతా సర్వేశాం విష్ణురేవ న సంశయ:

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement