Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 13
13.
గామావిశ్య చ భూతాని
దారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీ: సర్వా:
సోమో భూత్వా రసాత్మక: ||

తాత్పర్యము : నేను ప్రతి గ్రహము నందు ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్ష్య యందు నిలిచియున్నవి. నేనే చంద్రుడనై సర్వ ఔషధులకు జీవరసమును సమకూర్చుచున్నాను.

భాష్యము : భగవంతుని శక్తి వలన గ్రహాలు గాలిలో తేలుతూ తమ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుచూ ఉంటాయి. ‘శ్రీ బ్రహ్మ సంహిత’ అను గంథములో భగవంతుడు పరమాత్మ రూపములో ప్రతి అణువున, జీవుని యందు, గ్రహముల యందు ప్రవేశించి వానిని నడిపించునని తెలియజేయటమైనది. ఆత్మ ఉన్నంతవరకూ శరీరము నీటిలో తేలును. ఆత్మ శరీరమును వదలగానే, అది నీటిలో మునిగిపోవును. తరువాత తేలికగా మారి చెత్తాచెదారముతో పైకి తేలును. అలాగే మనము ఇసుకను గుప్పిటలో పట్టి ఉంచినట్లయితే అది గాలిలో నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే గుప్పిటిని వదులుతామో అప్పుడు ఇసుక నేలపైన పడిపోతుంది. అలాగే భగవంతుని గుప్పెట్లో, ఆయన శక్తి వలన గ్రహాలు తేలుచున్నాయి. లేకపోతే అవి పాతాళమునకు చేరుకుంటాయి. అలాగే చంద్రుని వెన్నెల వలన కూరగాయలలో వృద్ధి, రసము, రుచి చేరుకున్నవి. ఈ రోజు మానవాళి రుచికరమైన ఆహార పదార్థాలను తినుచున్నారంటే అది చంద్రుని ద్వారా భగవంతుని కృప మాత్రమే.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement