Thursday, November 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 12
12.
యదాదిత్యగతం తేజో
జగద్భాసయతే ఖిలమ్‌ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ
తత్తేజో విద్ధి మామకమ్‌ ||

తాత్పర్యము : సమస్త జగమునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజము కూడా నా నుండియే కలుగుచున్నవి.

భాష్యము : శ్రీకృష్ణుడు ఈ శ్లోకమున తన అంశలైన జీవరాశులు తిరిగి తన ధామమునకు ఎట్లు రావచ్చునో వివరించుచున్నాడు. ప్రతి విశ్వములో ఒక సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుని వలన మిగిలిన గ్రహాలన్నీ వెలుతురును పొందుతాయి. తెల్లవారు ఝామున సూర్యకాంతి ప్రసరించగానే మనము కార్యాలను మొదలు పెడతాము. పొయ్యి వెలిగించి వంట ప్రారంభిస్తాము. అలా అగ్ని ద్వారా గృహాలలోనే కాక కర్మాగారాలలోనూ కార్యములు మొదలు పెట్టబడును. అలాగే చంద్రుని వెన్నెల వలన కూరగాయలలో రసములు, పంటలలో వృద్ధి సమకూరుతాయి. ఇలా మనము సూర్యుడు, అగ్ని లేదా విద్యుత్తు, చంద్రునిపైన ఎంతగా ఆధారపడి ఉన్నామంటే, అవి లేనిదే మన మనుగడ కొనసాగించలేము.

ఈ శ్లోకములో అవి భగవంతుని కృప వలన మనము పొందుచున్నామని తెలియజేయబడినది. ఈ విధముగా ఆలోచించుట ద్వారా బద్ధ జీవులు కూడా కృష్ణ చైతన్యవంతులు కావచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement