అధ్యాయం 15, శ్లోకం 3
3.
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ||
4.
తత:ప దం తత్పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయ: |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యత: ప్రవృత్తి: ప్రసృతా పురాణీ ||
తాత్పర్యము : ఈ వృక్షపు యథార్దరూపము ఈ జగమునందు తెలియబడదు. దాని ఆదినిగాని, అంతము గాని లేదా మూలమును గాని ఎవ్వరును అవగతము చేసికొనజాలరు. కాని స్థిరముగా నాటుకొని యున్న ఈ సంసారవృక్షమును మనుజుడు దృఢ చిత్తముతో అసంగమను శస్త్రముచే ఖండంచి వేయవలయును. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్యపదమును పొందుటకు ప్రయత్నించి, అనాదికాలము నుండి ఎవ్వని వలన సమస్తము ఆరంభమయ్యెనో మరియు వ్యాప్తినొందెనో అట్టి పరమపురుషుని అచ్చట శరణుపొందవలెను.
భాష్యము : ఈ వృక్షపు వేర్లు పైకి ఉండి అనంతముగా విస్తరించి ఉండుటచే దీని విస్తీర్ణత ఊహలకు అందనిదై ఉన్నది. నేను నా తండ్రి నుండి వచ్చాను. ఆయన తన తండ్రి నుండి వచ్చాడు, ఈ విధముగా వెళ్తే అందరు బ్రహ్మదేవుడి నుండి వచ్చారు. ఆయన గర్భోదకశాయి విష్ణువు నుండి వచ్చాడు. ఇలా భగవద్విజ్ఞానము తెలిసిన వ్యక్తుల సాంగత్యములో ఈ అన్వేషణ చేసి భగవంతుడే ఈ వృక్షమునకు మూలమని అర్థము చేసుకొనవలసి ఉన్నది.
ఆ తరువాత భౌతిక భోగానుభవము మానుకొని ఇంద్రియ తృప్తిని విడనాడవలెను. శుద్ధ భక్తుల సాంగత్యములో శాస్త్రములను చర్చించుట ద్వారా, శ్రవణకీర్తనములను అభ్యసించి భగవంతుణ్ని శరణు పొందినట్లయితే భగవంతుని కృపకు పాత్రులై ఈ భౌతిక బంధనాల నుండి విముక్తులు అయ్యే అవకాశము ఉంటుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..