అధ్యాయం 14, శ్లోకం 17
17.
సత్త్వాత్ సంజాయతే జ్ఞానం
రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో
భవతో జ్ఞానమేవ చ ||
తాత్పర్యము : సత్త్వ గుణము నుండి వాస్తవ జ్ఞానమును వృద్ధినొందును. రజోగుణము నుండి లోభము వృద్ధినొందగా, తమో గుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి యనునవి వృద్ధి నొందుచున్వి.
భాష్యము : నేటి నాగరికత రజోగుణము, తమో గుణమును ప్రోత్సాహించుచున్నది కాబట్టి మానవులకు శ్రేయస్కరమైనది కాదు. ‘ ఈరోజు జంతువును వధిస్తే వచ్చే జన్మలో నేను ఆ జ ంతువుచే చంపబడుదును’ అను ఇంగిత జ్ఞానము లోపించుట వలన ప్రజలు తమో గుణముచే అధోగతి పాలగుచున్నారు. ఇటువంటి విద్యలేని కారణముగా బధ్యతా రహితులగుచున్నారు. అందువలన కృష్ణ చైతన్యమును స్వీకరించి సత్త్వ గుణమునకు ఉద్ధరింపబడవలెను. ఈ విద్య పొందిన వారు బుద్ధిమంతులై వాస్తవాన్ని చూడగలుగుతారు. ఇక రజోగుణములో ఉన్నవారు అంతులేని కోరికలను కలిగి ఉందురు. తమ స్థితికి తగ్గట్లుగా జీవించుటకు అమిత ప్రయాస పడుచుందురు. ఎప్పుడూ అనేక ప్రణాళికలు, ఎత్తులకు పై ఎత్తులూ వేయుచూ అసంతృప్తితో నుందురు. ఇక తమోగుణములో నున్నవారు తమ దుస్థితిని భరించలేక మత్తుమందులను సేవించుచూ తమ స్థితిని దిగజార్చుకుందురు. ఇక వారి భవిష్యత్తు అంధకారముతో నిండి ఉంటుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..