అధ్యాయం 14, శ్లోకం 7
7.
రజో రాగాత్మకం విద్ధి
తృష్ణాసంగసముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌంతేయ
కర్మసంగేన దేహినమ్ ||
తాత్పర్యము : ఓ కౌంతేయా! అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును.
భాష్యము : రజోగుణము స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ ద్వారా వ్యక్తమవుతుంది. స్త్రీ పురుషుని పట్ల ఆకర్షితమైతే, పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షితుడగుతాడు. ఎప్పుడైతే ఆ ఆకర్షణ పెరుగుతుందో భౌతిక ఆనందాన్ని పొందాలని బలమైన కోరికలు కలుగుతాయి. దాన్ని నెరవేర్చుకొనుటకు సమాజములో పలుకబడి కలిగి, భార్యాపిల్లలతో మంచి గృహములో ఉండాలని కోరుకుంటాడు. అందుకోసమై ఎంతో కష్టించి పనిచేయవలసి వస్తుంది. తన కార్యాల ఫలితాలపై ఆసక్తి వలన అనేక కార్యాలలో త లమునకలై పోతాడు. ఈ భౌతిక ప్రపంచములో ఎక్కువ శాతము ఈ రజోగుణము చేతనే బంధీలై ఉన్నారు. ప్రత్యేకించి నేటి ఆధునిక నాగరికత రజోగుణమును ఎంతో పెంపొందిస్తూ ఉన్నది. సత్త్వ గుణములో ఉన్నవారికే ముక్తి లేకున్న ఇక రజోగుణములో ఉన్న వారి గురించి చెప్పనేల?
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..