అధ్యాయం 13, శ్లోకం 18
18
జ్యోతిషామపి తజ్జ్యోతి:
తమస: పరముచ్చతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం
హృది సర్వస్య విష్ఠితమ్ ||
తాత్పర్యము : తేజోపూర్ణములైన సర్వములందు తేజ: కారణుడు అతడే. భౌతికత్వమను అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞానగమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై యున్నాడు.
భాష్యము : పరమాత్మ, భగవంతుడు కాంతివంతముగా కనిపించే సూర్యుడు, చంద్రుడు వంటి వాలి వలె ఎల్లప్పుడూ తేజోవంతముగా ఉండును. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో సూర్యచంద్రుల అవసరము లేదు. అయితే భౌతిక జగత్తులో సమస్తమూ భౌతిక మూలకములు, మహతత్త్వముచే కప్పబడి ఉండుట చేత భగవంతుని కాంతి కిరణాల ప్రభావమును చూడలేకపోవుచున్నాము. అందువలన ఇక్కడ ప్రత్యేకముగా వెలుతురు కోసము సూర్యుని అవసరము ఉన్నది. భగవంతుడే జ్ఞానగమ్యము. ఎందువలనంటే ప్రతిజీవి హృదయములో పరమాత్మగా ఉన్న భగవంతునికి శరణు పొందినప్పుడు మాత్రమే, ఆయనను అర్థు చేసుకని, ఈ జన్మమృత్యు చక్రము నుండి బయట పడగలుగుతాము. జీవియొక్క కాళ్ళూ చేతులూ తన శరీరము వరకే పరిమితమైతే భగవంతుని కాళ్ళూ చేతులూ సర్వత్రా విస్తరించి ఉండుటచే, అతడే అన్ని జీవులకు ప్రభువు. కాబట్టి ప్రతిక్షేత్రము నందు ఆత్మపరమాత్మలుగా ఇరువులు క్షేత్రజ్ఞులు ఉందురని, వారు ఎల్లప్పుడు వేర్వేరని మనము అర్ధము చేసుకొనవచ్చును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..