Tuesday, November 26, 2024

గీతాసారం…(ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 1,2
ఓం శ్రీ పరమాత్మనే నమ:

అథ త్రయోదశోధ్యాయ:
క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగయోగ:

1.
అర్జున ఉవాచ
ప్రకృతిం పురుషం చైవ
క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ
ఏతద్‌ వేదితుమిచ్ఛామి
జ్ఞానం జ్ఞేయం చ కేశవ

2
శ్రీభగవాన్‌ ఉవాచ
ఇదం శరీరం కౌంతేయ
క్షేత్రమిత్యభిధీయతే |
ఏతద్యో వేత్తి తం ప్రాహు:
క్షేత్రజ్ఞ ఇతి తద్విద: ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! ప్రకృతి మరియు పురుషుని గూర్చియు, క్షేత్రము మరియు క్షేత్రము నెరిగినవానిని గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను.

- Advertisement -

శ్రీకృష్ణ భగవానుడు పలికెను : ఓ కౌంతేయా! ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును.

భాష్యము : అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానముగా, కృష్ణుడు మొట్టమొదట ఇంద్రియములతో కూడి ఉన్న ఈ శరీరము క్షేత్రమని మరియూ శరీరము తనదని భావించే బద్ధ జీవియే, శరీరమును తెలియు క్షేత్రజ్ఞుడని తెలియజేసెను. భగవద్గీత నందు తెలియజేసినట్లు ప్రతి జీవి యొక్క శరీరము బాల్యము నుండి యవ్వనమునకు తరువాత మధ్య వయస్సునకు చివరకు వృద్ధాప్యమునకు మూర్పు చెందుచూ ఉండును. అయితే జీవుడు మాత్రము మార్పు చెందని వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి లేదా ఈ మార్పులను గమనించువాడైన యజమానిని క్షేత్రజ్ఞుడని, క్షేత్రమునకు భిన్నమని స్పష్టముగా పేర్కొనెను. మనము, ”నేను ఆనందముగా ఉన్నాను”, ”నేను పురుషుణ్ని”, ”నేను స్త్రీని”, ”నేను పిల్లిని” అని భావించినపుడు, అవి కేవలము క్షేత్రజ్ఞుని లేదా బద్ధ జీవుని యొక్క శారీరక చింతనలేనని అర్థము చేసుకొనవలెను. జీవుడు తన కోరికలను తీర్చుకొనుటకు మరియు, భౌతిక ప్రకృతి పై ఆధిపత్యము చెలాయించుటకు తగిన క్షేత్రము లేదా భౌతిక శరీరములో బంధీ కాబడతాడు. క్షేత్రజ్ఞుడు లేదా జీవుని గురించి మరియు అతడు భగవంతుణ్ని ఎలా అర్థము చేసుకోగలుగుతాడో మరియు అతడు శాశ్వతముగా భగవంతుని ఆధీనములో ఎలా ఉంటాడో, దానిని మరచినట్లయితే జీవుడు ఏవిధముగా దు:ఖాన్ని అనుభవిస్తాడో, భగవద్గీతలో ఇప్పటి వరకు వివరింపబడ్డాయి. ఇక ఈ పదమూడవ అధ్యాయముతో మొదలుగా జీవుడు ఈ భౌతిక ప్రకృతి సంపర్కములో ఎలా వస్తాడో, అతడు ఏ విధముగా కామ్యకర్మల నుండి వేరు వేరు పద్ధతుల ద్వారా భగవంతునిచే ఉద్ధరింపబడతాడో, జ్ఞానాన్ని సముపార్జించి, భక్తిని పాటించగలుగుతాడో వివరించటమైనది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement