Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 5

5.
క్లేశోధికతరస్తేషామ్‌
అవ్యక్తాసక్తచేతసామ్‌ |
అవ్యక్తా హి గతిర్దు:ఖం
దేహవద్భిరవాప్యతే ||

తాత్పర ్యము : పరమపురుషుని అవ్యక్త నిరాకార త త్త్వము నందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి యనునది మిక్కిలి క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లపుడును కష్టతరమే.

భాష్యము : భగవంతుని అవ్యక్తరూపాన్ని ధ్యానించే వారిని జ్ఞానయోగులు అందురు. ప్రత్యక్షముగా భగవంతున్ని పూజించే వారిని భక్తి యోగులు అందురు. ఇద్దరూ చివరికి ఒకే లక్ష్యాన్ని చేరుకున్నా జ్ఞానయోగము కష్టతరమైనది భక్తియోగము బద్ధ జీవునికి సులభమైనదని ఇక్కడ స్పష్టపరచబడినది. గురువు మార్గనిర్దేశములో భక్తుడు శ్రవణము చేస్తూ భగవంతుని విగ్రహ రూపాన్ని సేవిస్తూ సులభంగా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. భగవంతడు సర్వశక్తిమంతుడు కాబట్టి విగ్రహరూపములో భౌతిక మూలకాల ద్వారా సేవలను స్వీకరించగలడు. అయితే జ్ఞానయోగములో వేదాలను, ప్రత్యేకించి కష్టతరమైన ఉపనిషత్తు వాక్కులను అర్ధము చేసుకుంటూ, ఇంద్రియములను నిగ్రహించుకుంటూ చివరికి పరతత్త్వాన్ని అర్థము చేసుకోగలుగుతాడో లేదో చెప్పలేము. ఆత్మ సచ్చిదానంద విగ్రహుడు అయితే జ్ఞాన యోగము ద్వారా సత్‌, చిత్‌ స్వభావాలను మాత్రమే సాక్షాత్కరించుకోగలము. ఏదో అదృష్టవశాత్తు శుద్ధభక్తుని సాంగత్యము ద్వారా భక్తిలోకి వచ్చి ఆనందాన్ని సాక్షాత్కరించుకొనుటకు ప్రయత్నించినా పూర్వపు అభ్యాసాల వలన భక్తియోగము కష్టతరమగును. అందుచే ప్రత్యేకించి కలియుగమున ఈ పద్ధతి మొదటి నుండి చివరకు కష్టతరమై సామాన్యునికి వీ లుకాదని కృష్ణుడు ఇక్కడ తన అభిప్రాయాన్ని తెలియజేయుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement