Friday, September 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 52
52.
శ్రీభగవాన్‌ ఉవాచ
సుదుర్దర్శమిదం రూపం
దృష్టవానసి యన్మమ |
దేవా అప్యస్య రూపస్య
నిత్యం దర్శనకాంక్షిణ: ||

తాత్పర్యము : శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుట మిగుల దుర్లభమైనది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించు అవకాశమునకై దేవతలు సైతం నిత్యమూ వేచి యుందురు.

భాష్యము : ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కేవలము వేదాధ్యయనము, తపస్సు, దానము, మరియూ పుణ్యకర్మల ద్వారా విశ్వరూపమును చూడలేరని, కనీసము కొద్దిపాటి బక్తి అయినా లేనిదే దర్శించుట సాధ్యము కాదని అర్థమగుచున్నది. ఇక్కడ ”సుదుర్దర్శనం” అను పదము వలన ఈ ద్విభుజరూపమును దర్శించుటకు ఇంకా కష్టమైనదని తెలియుచున్నది. దీనిని దేవతలు సైతము చూడజాలరని చెప్పబడినది. దేవకీ గర్భము నందున్నపుడు కూడా దేవతలు వచ్చి ప్రార్థనలు చేసేవారు. కాబట్టి అజ్ఞానులు మాత్రమే శ్రీకృష్ణుడు సామాన్యుడని భావించి, లేక ఒక గొప్ప వ్యక్తి అనో, నిరాకారమ సాకారముగా భౌతిక రూపాన్ని పొందినదనో భావించుదురు. కాబట్టి మన స్వంత ప్రయత్నాలతో, ఊహాగానాలతో, శాస్త్రాధ్యయనముతో సరైన అవగాహనకు రాలేము. కేవలము ప్రామాణిక గురువు నుండి శ్రవణము చేయుట ద్వారా కృష్ణున్ని ప్రసన్నము చేసుకొని ఆయన కృప ద్వారా మాత్రమే కృష్ణుని నిజరూపానన్ని దర్శించగలుగుతాము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement