Saturday, November 23, 2024

గీతాసారం (ఆడియతో…)

అధ్యాయం 7, శ్లోకం 6

ఏతద్యోనీని భూతాని
సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగత:
ప్రభవ: ప్రలయస్తథా ||

తాత్పర్యము : సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై యున్నవి. ఈ జగత్తు నందలి భౌతికమును, అధ్యాత్మికమును అగుసర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే యని నిశ్చయముగా నెరుగును.

భాష్యము : ఈ ప్రపంచములో మనము చూసేదంతా జీవము మరిము భౌతిక పదార్థములతోనే కూడి ఉంటుంది. సృష్టికి జీవుడు కారణముగా, భౌతిక పదార్థములు జీవుని వలన సృష్టించబడినవి. కొందరు భౌతిక మూలకములు వృద్ధి చెంది జీవమునకు కారణమైనదని తప్పుగా వాదించుదురు. కానీ మనము అనుదినమూ జీవము ఉండుటవలన వ్యక్తి బాలునిగా పిమ్మట యవ్వనునిగా వృద్ధి చెందుటను చూస్తూ ఉంటాము. ఇలా భగవంతునిలో ఒక శక్తియైన జీవుడు ఒక గొప్ప నగరాన్నో, వంత అంతస్తుల భవనాన్నో సృష్టించగలడేమో గాని ఒక విశ్వాన్ని సృష్టించలేడు. శ్రీకృష్ణుని విస్తార రూపమైన పరమాత్మ మాత్రమే దానిని చేయగలడు. ఈవిధముగా జీవుడైన చిన్న ఆత్మకు, పరమాత్మకూ మూలమైన శ్రీకృష్ణుడే సర్వానికి మూలమని ఉపనిషత్తులు
సైతమూ కొనియాడుచున్నవి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement