అధ్యాయం 11, శ్లోకం 48
48.
న వేదయజ్ఞాధ్యయనైర్న దానై:
న చ క్రియాభిర్న తపోభిరుగ్రై: |
ఏవంరూప: శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ||
తాత్పర్యము : ఓ కురుప్రవీరా! వేదాధ్యనము చేతగాని, యజ్ఞములచేతగాని, దానములచేత గాని, పుణ్యకర్మలచేత గాని, ఉగ్రమడు తప్సులచేత గాని భౌతిక జగమున ఈ రూపములో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరును గాంచి యుండరు.
భాష్యము : విశ్వరూపాన్ని చూడటానికి దివ్య చక్షువులు కావలెను. అవి దివ్యత్వాన్ని కలిగి ఉన్నవారే పొందగలరు. భగవంతుని భక్తులు మాత్రమే ఆ దివ్యత్వాన్ని కలిగి ఉందురు గాని మిగిలినవారు కాదు. కాబట్టి అర్జునుడు, దేవతలు విశ్వరూపాన్ని చూడగలిగారు. అయితే దైవ శక్తిలో ఉండే శుద్ద భక్తులు విశ్వరూపము పట్ల అంత ఆసక్తిని కలిగి ఉండరు. ఇంతకు ముందే విన్నట్లు, అర్జునుడు భయపడి చతుర్భుజ రూపాన్ని కోరుకొనెను. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశము వేదాద్యనము, దానము, తపస్సు, పుణ్యకార్యాలు మొదలగునవి చేయుట ద్వారా విశ్వరూపాన్ని చూచుట సాధ్యము కాదని, అర్జునునివలె భక్తులు కానిదే ఇది సాధ్యపడదని స్పష్టపరుచబడినది. అలాంటప్పుడు నాస్తికులు, నిరాకారవాదులకు కూడా సాధ్యపడదని మనము అర్థము చేసుకొనవచ్చు. ఇక బూటకపు అవతారాలు, వారి శిష్యుల గురించి చెప్పనేల? కాబట్టి భగవద్గీతను సరైన పరంపరలో అర్థము చేసుకోవటం ద్వారా మనకు సరైన జ్ఞానము లభించి మోసపోకుండా కాపాడబడతాము.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..