అధ్యాయం 11, శ్లోకాలు 41,42
41.
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ! హే యాదవ! హే సఖేతి !
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ||
42.
యచ్చాపహాసార్థమసత్కృతోసి
విహారశయ్యాసనభోజనేషు |
ఏకోథ వాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ||
41-42 తాత్పర్యము : నీ మహిమను తెలియక నిన్ను మిత్రునిగా భావించి ”ఓ కృష్ణా”, ”ఓ యాదవా”, ”ఓ మిత్రమా” అని తొందరపాటుగా సంభోదించితిని. ప్రేమతో గాని లేదా మూర్ఖత్వముతో గాని నేనొరించిన దానినంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు ఒంటరిగా కొన్నిమార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరపరచితిని. ఓ అచ్యుతా! ఆ అపరాధములన్నంటికిని నన్ను క్షమింపుము.
భాష్యము : శ్రీ కృష్ణుని విశ్వరూపాన్ని చూస్తున్నప్పటికీ అర్జునుడు కృష్ణునితో గల తన స్నేహపూర్వక కార్యకలాపాలను గుర్తు చేసుకొనుచూ ఉన్నాడు. తనకు ఇంతకుముందు అనగా విశ్వరూపము చూపకముందు కృష్ణుని యొక్క గొప్పతనము తెలియక ఆ విధముగా ప్రవర్తించానని, తాను ఒక ఆప్త మిత్రుడుగా చులకనగా మాట్లాడిన వాటికి క్షమించమని అర్థిస్తూ ఉన్నాడు. కృష్ణుడు ఎంత దయా హృదయుడంటే అన్ని వైభవాలు ఉండి కూడా అర్జునితో స్నేహితుని వలె మెలగెను. విశ్వరూపమును చూసిన తరువాత కూడా అర్జునుడు తన స్నేహసంబంధాన్ని మరచిపోలేదు. ఈ విధముగా కృష్ణునితో జీవికి గల సంబంధము శాశ్వతమైనది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..