అధ్యాయం 11, శ్లోకం 38
38.
త్వమాదిదేవ: పురుష: పురాణ:
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనంతరూప ||
తాత్పర్యము : నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, వివ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయమువు. నీవే సర్వమును ఎఱిగినవాడవు. తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్యశరణ్యుడవు. ఓ అనంతరూపా! ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడియున్నది.
భాష్యము : అంతా భగవంతుని మీదే ఆధారపడి ఉంటుందని, చివరకు బ్రహ్మ తేజమునకు సైతము అతడే ఆధారము కనుక ‘నిధానము’ అని సంభోదించెను. ఈ ప్రపంచములో ఏది జరుగుచున్నా ఆయనకు తెలియును. జ్ఞానానికి ఏదైనా హద్దు ఉన్నది అంటే అది శ్రీకృష్ణుడే. ఈ విధముగా శ్రీకృష్ణుడు అన్నీ తెలిసినవాడు మరియు అందరూ తెలుసుకొనవలసినవాడు. ఆయన సర్వాంతర్యామి కాబట్టి జ్ఞాన గమ్యము కూడా శ్రీకృష్ణుడే. ఆధ్యాత్మిక జగత్తుకే కారణము కనుక ఆయన దివ్యమైనవాడు, అంతేకాక ఆ శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ప్రపంచమున అత్యున్నతమైన వ్యక్తి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..