అధ్యాయం 11, శ్లోకం 33
33.
తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుం క్ష్వ రాజ్యం సమృద్ధమ్ |
మయైవైతే నిహతా: పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ||
తాత్పర్యము : అందచే లెమ్ము. యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడింపుము. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యముననుభవింపుము. ఓ సవ్యసాచీ! నా ఏర్పాటుచే వారందరును ఇది వరకే మరణించియున ్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్తమాత్రుడవగుము.
భాష్యము : ”నిమిత్త మాత్రం” అనగా ”నా చేతిలో పరికరము కమ్ము” అను పదాలు చాలా ముఖ్యమైనది. ఈ ప్రపంచము భగవంతుని ప్రణాళిక ప్రకారము కొనసాగుచున్నది. తగినంత జ్ఞానములేని వారు ప్రకృతే అంతటినీ నడిపిస్తున్నదని, సృష్టి వెనుక ఒక ప్రణాళిక ఏమీ లేదని, అన్నీ అకస్మాత్తుగా సంభవిస్తుందటాయిని చెప్పుచుందురు. కొందరు శాస్త్రజ్ఞులు సైతమూ అలా జరిగి ఉండవచ్చు. బహుశా ఇది కారణమై ఉండవచ్చు అని ఊహ కల్పనలు చేయుచుందురు. అయితే నిజానికి అన్నీ భగవంతుని ప్రణాళిక ప్రకారమే జరుగుతాయని, ఆయన ప్రణాళిక జీవులను భగవద్దామానికి తీసుకు వెళ్ళుటయేనని మనము అర్థము చేసుకొనవలెను. కాబట్టి భగవంతుని కోరిక మేరకు అర్జునుడు యుద్ధము చేసి ఆయన ప్రణాళికలో భాగము కావలెను. అలాగే ప్రతి ఒక్కరూ భగవంతుని సేవలో పాల్గొన్నచో జీవితమును సార్ధకము కావించుకున్న వారగుదురు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..