Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 5

5.
శ్రీభగవాన్‌ ఉవాచ
పశ్య మే పార్ధ రూపాణి
శతశోథ సహస్రశ: |
నానావిధాని దివ్యాని
నానావర్ణకృతీని చ ||

తాత్పర్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : ఓ అర్జునా! పృథకుమారా! లక్షలాదిగాగల నానావిధములను, దివ్యములను, పలు వర్ణమయములను అగు రూపములను (నా విభూతులను) ఇప్పుడు గాంచుము.

భాష్యము : శ్రీకృష్ణుని విశ్వరూపము దివ్యమైనదే కానీ శాశ్వతమైనది కాదు. ఈ దృశ్యమాన జగత్తు ఉన్నంతకాలమే అది కూడా ఉంటుంది. ఈ సృష్టి కొంతకాలము వ్యక్తమై మరి కొంతకాలము అవ్యక్తమవుతుంది. అదేవిధముగా కృష్ణుని విశ్వరూపము కూడా వ్యక్తమై మరలా అవ్యక్తమవుతుంది. అనగా భగవంతుని వివిధ రూపాలు, అవతారాల వలే విశ్వరూపము శాశ్వతమైనది కాదు. భక్తులు దీనిని అంతగా చూడాలని కోరుకోరు. కానీ అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు దీనిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అయితే దీనిని దర్శించటము సామాన్య మానవునికి సాధ్యపడదు. భగవంతుడు దివ్యదృష్టిని ఇవ్వవలసి ఉంటుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement