Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 10, శ్లోకం 42
42.
అథవా బహునైతేన
కిం జ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్న్సమ్‌
ఏకాంశేన స్థితో జగత్‌ ||

తాత్పర్యము : కాని ఓ అర్జునా! ఈ సవిస్తరమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించు చుందును.

భాష్యము : భగవంతుడు, ఈ భౌతిక ప్రపంచమునందలి అన్ని విశ్వములందు, వ్యక్తమైన ప్రతి వస్తువు వ్యక్తినందు పరమాత్మ రూపమున ప్రవేశించెను. ఇక్కడ భగవంతుడు అర్జునునికి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయుచున్నాడు. అది ఏమనగా మనము ఈ ప్రపంచములోని తళుకు, బెళుకులు, వింతలూ, విచిత్రాలను వేరు వేరుగా చూసి ఆశ్చర్యపడనవసరము లేదని, వేరుగా అధ్యయనాలు, పరిశీలనలు చేయవలసిన అవసరము లేదని అవన్నీ తాను పరమాత్మగా ప్రవేశించుటచే సాధ్యమగుచున్నవి తెలియజేయుచున్నాడు. గొప్ప జీవియైన బ్రహ్మకు మొదలు, చిన్న చీమ వరకు ప్రతి ఒక్క దాని యందు, అన్నింటి యందునా పరమాత్మ రూపములో కృష్ణుడు ప్రవేశించుట వలననే అవి ఆ విధముగా మనుగడను కలిగి ఉన్నవి. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తితో కృష్ణచైతన్యము నందు మనస్సును నిలుపలెను. ప్రత్యేకించి ఈ అధ్యాయమున ఎనిమిది నుండి పదకొండు శ్లోకాలలో చెప్పిన విధముగా భగవద్భక్తిని పాటించవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విభూతియోగోనామ దశమోధ్యాయ: ||

Advertisement

తాజా వార్తలు

Advertisement