అధ్యాయం 10, శ్లోకం 37
37.
వృష్ణీనాం వాసుదేవోస్మి
పాండవానాం ధనంజయ: |
మునీనామప్యహం వ్యాస:
కవీనాముశనా కవి: ||
తాత్పర్యము : నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి యున్నాను.
భాష్యము : వృష్ణి వంశజులలో వసుదేవుని తనయులైన కృష్ణ, బలరాములను ‘వాసుదేవులు’ గా సంభోదించెదురు. ఇక్కడ కృష్ణుడు, బలరాముని ఉద్దేశించి పలికెను. పాండవులలో ధనుంజయుడు, నరోత్తముడు అయిన అర్జునుడు ఉత్తముడు. అతడు కృష్ణుని ప్రతినిధి. అలాగే వేదాలను రకరకాలుగా వివరించగల మునులలో వ్యాసదేవుడు ఉత్తముడు, అతడు కృష్ణుని అవతారము. అలాగే కవులలో ఎంతో తెలివి గల, దూరచూపు గల రాజనీతి జ్ఞుడు అయిన శుక్రాచార్యుడు (‘ఉశనా’ కవి) ఉత్తముడు. అతడు శ్రీకృష్ణుని ప్రతినిధి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..