అధ్యాయం 10, శ్లోకం 14
14.
సర్వమేతదృతం మన్యే
యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్ వ్యక్తిం
విదుర్దేవా న దానవా: ||
తాత్పర్యము : ఓ కృష్ణా! నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరించుచున్నాను. ఓ దేవదేవా! దేవతలుగాని, దానవులు గాని నీ స్వరూపమును ఎరుగజాలరు.
భాష్యము : అర్జునుడు ఇక్కడ ”దేవతలు, దానవులు” సైతమూ శ్రీకృష్ణున్ని అర్ధము చేసుకొనలేరని నిర్ధారించి చెప్పుచున్నాడు. ఇక నాస్తిక వాదులు, వక్రభాష్యము చెప్పువారి పరిస్థితి మనము అర్థము చేసుకొనవచ్చును. అర్జునుడు తన భక్తుడు మరియు సఖుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఆయనను గురుపరంపరా పద్ధతిని తిరిగి పున:స్థాపించుటకు ఎన్నుకొనెను. పరంపరానుగతమునే భగవద్గీతను యధావిధిగా స్వీకరించుట సాధ్యమగును. అప్పుడే అర్జునుని వలే”నీవు చెప్పినదంతా నేను స్వీకరిస్తున్నాను” అనే భావన మనము కలిగి ఉండగలుగుతాము. అప్పుడు మాత్రమే భగవద్గీతా సారాంశాన్ని తద్వారా శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనే సత్యాన్ని అతనిలో ఏ లోటూ లేదని, పరిపూర్ణుడని అర్థము చేసుకోగలుగుతాము.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో