అధ్యాయం 5, శ్లోకం 13.
సర్వకర్మాణి మనసా
సన్న్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ
నైవ కుర్వన్ న కారయన్ ||
తాత్పర్యము : దేహము నందున్న జీవుడు తన స్వభావమును అనుసరించి మానసికముగా కర్మలనన్నింటిని త్యజించినప్పుడు, కర్మను చేయక మరియు కర్మకు కారణము కాక నవద్వారపురము నందు (దేహములో) సుఖముగా వసించును.
భాష్యము : ఆత్మ లేక జీవుడు నవ ద్వారాముల గల పురము వంటి శరీరములో నివసిస్తూ ఉంటాడు. త్రిగుణముల ప్రభావముచే అప్రయత్నముగానే అనేక కార్యాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. తలచుకుంటే ఈ బంధనములకు అతీతముగా కూడా ఉండగలడు. భగవత్సేవకుడననే తన సహజమైన ఉన్నత స్థితిని మరచుటచే శరీరమే తానని భావించి దు:ఖాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి కృష్ణుడితో తనకు గల సంబంధాన్ని పునరుద్ధరించుకొననుటచే తిరిగి ఉన్నతుడవుతాడు. భగవంతుని పట్ల సేవా భావము పెంపొందించుకొనుట వలన చైతన్యము, ఆసక్తి మారి శారీరక కార్యముల బంధముల నుండి పూర్తిగా విముక్తుడవుతాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..