Monday, November 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 7
7.
మమైవాంశో జీవలోకే
జీవభూత: సనాతన: |
మన:షష్ఠానీంద్రియాణి
ప్రకృతిస్థాని కర్షతి ||

తాత్పర్యము : ఈ బద్ధభౌతిక జగమునందలి జీవులందరును నా శాస్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను గూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు.

భాష్యము : జీవుని యదార్ధస్థితి ఈ శ్లోకమున తెలియజేయబడినది. జీవుడు భగవంతునిలో శాశ్వతమైన అంశ. బద్ధ జీవనములోనే కాక ముక్త స్థితిలో కూడా జీవి స్వతంత్రతను కలిగి ఉంటుంది అని ‘సనాతన’ అనే పద ప్రయోగము బట్టి అర్థమగుచున్నది. ‘శాశ్వతమైన అంశ’ అనగా శాశ్వతముగా భగవంతుని లక్షణాలను కొద్దిపాటి పరిమాణములో కలిగి ఉంటుంది అని లెక్క. స్వతంత్రత కూడా భగవంతుని ఒక లక్షణము కనుక దానిని కొంత జీవుడు కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఆ కొద్దిపాటి స్వతంత్రత లేదా స్వేచ్ఛను దుర్వినియోగము చేసుకొని భగవత్సేవను మరచిపోతాడో త్రిగుణములలో చిక్కుకునిపోతాడు. అలా మనస్సు చెప్పినట్లు పరుగులు తీసి జీవుడు ఈ భౌతిక ప్రపంచమున జీవనాన్ని కొనసాగించుటకు నానా తంటాలను పడవలసి వస్తుంది. ఎప్పుడైతే సత్సాంగత్యముతో తిరిగి భగవత్సేవను గుర్తు తెచ్చుకుంటాడో అప్పుడు భౌతిక కార్యాల పట్ల ఆసక్తి క్షీణించి ఆధ్యాత్మిక దేహాన్ని పెంపొందించుకుని, ఆధ్యాత్మిక లోకాలకు తిరిగి వెళ్ళి భగవత్సాంగత్యములో ఆనందాన్ని చవి చూడగలుగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement