అధ్యాయం 13, శ్లోకం 26
26
అన్యే త్వేవమజానంత:
శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |
తేపి చాతితరంత్యేవ
మృత్యుం శ్రుతిపరాయణా: ||
తాత్పర్యము : ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయము లేకున్నను ఇతరుల నుండి పరమపురుషుని గూర్చి శ్రవణము చేసి అతనిని పూజించుట నారంభింతురు. ప్రామాణికుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి గలవారగుటచే వారునూ జనన, మరణ, మార్గమును తరింపగలరు.
భాష్యము : నేటి ఆధునిక ప్రపంచమునకు ఈ శ్లోకము తరుణోపాయమును చూపించుచున్నది. చాలా మంది విద్వాందసులు, పండితులు, జ్ఞానులుగా చలామణి అగుచున్నా వాస్తవమైన ఆధ్యాత్మిక జ్ఞానము లోపించుచున్నది. ఈ శ్లోకములో తెలుపబడినట్లు ఆధ్యాత్మిక జ్ఞానమును పొంగోరినవారు ఆత్మసాక్షాత్కారము పొందిన వారి వద్దకు వెళ్ళి శ్రద్ధతో శ్రవణము చేయవలెను. ఆధునిక యుగములో ప్రచారము చేసిన శ్రీ చైతన్య మహాప్రభువు, కుతర్కమును వదిలి ఆత్మదర్శులను సమీపించి ‘హరే క ృష్ణ హరే క ృష్ణ క ృష్ణ క ృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే ‘ అను మహా మంత్రమును వినవలెనని సూచించినారు. సామాన్య మానవులు సైతము ఆ విధముగా శుద్ధ భక్తులను సమీపించి శ్రవణము చేసి, సేవలను అందించి భగవద్భక్తులుగా మారి తిరిగి భగవద్ధామమునకు వెళ్ళ అవకాశమును పొందగలరని దీనిని బట్టి అర్థమగుచున్నది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..