Saturday, November 23, 2024

గీతాసారం (ఆడియోతో….)

అధ్యాయం 7, శ్లోకం 26

వేదాహం సమతీతాని
వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని
మాం తు వేద న కశ్చన ||

తాత్పర్యము : ఓ అర్జునా! దేవదేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగనున్న వాని నన్నింటిని ఎరుగుదును. అలాగుననే జీవులందరిని నేను ఎరుగుదును. కాని నన్నెవ్వరును ఎరుగరు.

భాష్యము : శ్రీకృష్ణుడు సాకారమా, నిరాకారమా అని నిర్ధారిచండానికి ఈ శ్లోకము చక్కని ఆధారాలను ఇచ్చుచున్నది. మాయావాదులనబడేవారు, కృష్ణుడికి రూపము లేదని, అతడు భౌతికమైన రూపాన్ని తీసుకుంటాడని వాదించేవారు, ఇక్కడ దృష్టిని సారించాలి. భౌతిక రూపము తీసుకుంటే, శరీరము మార్పు చెంది మనము గతాన్ని మరచిపోతాము, భవిష్యత్తును గుర్తించలేము. కేవలము ముక్త స్థితిలో మాత్రమే భూత, భవిష్యత్‌, వర్తమానాలను సమగ్రంగా గుర్తించగలుగుతాము. శ్రీకృష్ణుడు ఎప్పుడో భగవద్గీతను వివశ్వానుడికి, సూర్యభగవానుడికి చెప్పినట్లు నాల్గవ అధ్యాయములో
తెలియజేసినాడు. అంతేకాక ప్రతి జీవి హృదయములో పరమాత్మగా ఉంటూ అన్నితెలిసిన వ్యక్తి కాబట్టి అతనికి భౌతిక శరీరం ఉండదు. అయితే మేఘాలు కమ్మినప్పుడు మనము సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను చూడలేము. అంటే మేఘాలు మన దృష్టిని కప్పగలవేమో కాని సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కప్పలేవు. అదే విధముగా భగవంతుని యోగామాయా శక్తి నాస్తికులను, నిరాకారవాదులను కప్పగలదేమో గాని భగవంతున్ని కాదు. కేవలము భక్తులు మాత్రమే ఈ విషయాన్ని గ్రహించి శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ దేవాదిదేవుడిగా పూజించుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement