Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 60
60
యతతో హ్యపి కౌంతేయ
పురుషస్య విపశ్చిత: |
ఇంద్రియాణి ప్రమాథీని
హరంతి ప్రసభం మన: ||

తాత్పర్యము : ఓ అర్జునా ! ఇంద్రియములు బలవంతములును మరియు దృఢములను అయియున్నవి. వానిని అదుపుచేయ యత్నించు విచక్షణా పూర్ణుని మనస్సును సైతము అవి హరించివేయుచున్నవి.

భాష్యము : ఎంతో మంది ఋషులు, మునులు మరియు ఆధ్యాత్మిక వాదులు తమ ఇంద్రియములను నిగ్రహించుకొనుటకు నానా ప్రయత్నములను చేయుదురు. అయితే వారిలో ఎంతోగొప్పవారు సైతము విఫలమగుదురు. విశ్వామిత్ర ముని ఘోర తపస్సులను ఆచరించినా మేనకకు లొంగిపోయెను. కాబట్టి సంపూర్ణముగా కృష్ణ చైతన్యవంతులు కానిదే మనస్సు, ఇంద్రియములను నిగ్రహించుట సాధ్యము కాని పని. మనస్సును కృష్ణునిపై లగ్నము చేయనిదే భౌతిక కార్యములకు స్వస్తి చెప్పలేము. యమునాచార్యుల వారు చెప్పినట్లు ”నా మనస్సు భగవంతుని సేవలో నూతన ఆనందాన్ని పొందుతూ ఉన్నది కాబట్టి కామమును తలచుకుంటే వికారము కలుగుచున్నది” ఏ విధముగానైతే ఆకలిగొన్న వ్యక్తికి సరైన ఆహారము లభించినప్పుడు సంతృప్తి చెందుతాడో అలాగే కృష్ణ చైతన్యములో మాధుర్యమును చూసిన వ్యక్తికి భౌతికమైనవి రుచించవు. కేవలము కృష్ణ చైతన్యములో మనస్సును నిలుపుట వలన అంబరీష మహారాజు దూర్వాస మునిని ఓడించగలిగినాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement