Monday, November 18, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 51
51
కర్మజం బుద్ధియుక్తా హి
ఫలం త్యక్త్వా మనీషిణ: |
జన్మబంధవినిర్ముక్తా:
పదం గచ్ఛంత్యనామయమ్‌ ||

తాత్పర్యము : ఆ విధముగా భక్తి యోగము నందు నియుక్తులై మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక గజమునందు కర్మఫలముల నుండి తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధంగా వారు జనన, మరణ చక్రము నుండి విడుదలను పొంది (భగవద్ధామమును చేరుట ద్వారా) దు:ఖరాహిత్య స్థితిని పొందుచున్నారు.

భాష్యము : అజ్ఞానము కారణము చేత, జీవుడు ఈ భౌతిక ప్రపంచము దు:ఖపూరితమైనదని, అడుగడుగునా ఆపదలతో కూడుకుని ఉన్నదని గ్రహించలేడు. అటువంటి అజ్ఞానము వలననే తెలివితక్కువ వారు తమ కార్యాలను మెరుగుపరిచినట్లయితే మంచి ఫలితాలువచ్చి ఆనందముగా ఉండగలమని భావించుదురు. అయితే వారికి అర్థము కాని విషయమేమిటంటే ఈ భౌతిక ప్రపంచములో ఎటువంటి శరీరాన్ని పొందినా జన్మమృత్యు జరా వ్యాధి తప్పదని. ఎవరైతే తన సహజస్థితిని అర్థము చేసుకోగలుగుతాడే, అతడు భగవంతుని స్థితిని కూడా అర్థము చేసుకుంటాడు. అటువంటి వ్యక్తి నేను భగవంతుని దాసుడనని గుర్తించి సేవ చేస్తాడే తప్ప భగవంతునితో సమానుడనని గాని, భావించి అజ్ఞానములో ఉండి సేవను నిరాకరించడు. అటువంటి సేవకుడు నిస్సంకోచముగా వైకుంఠ లోకాలకు వెళ్ళుటకు అర్హుడగుతాడు. భగవంతుని ప్రసన్నార్థము చేసే సేవనే కర్మయోగ, లేదా బుద్ధియోగ లేదా భగవత్సేవ అనవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement