Sunday, November 24, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 47
47
కర్మణ్యవాధికారస్తే
మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూ:
మా తే సంగో స్త్వకర్మణి ||

తాత్పర్యము : విద్యుక్త ధర్మమును నిర్వర్తించుట యందే నీకు అధికారుము కలదు గాని కర్మఫలము నందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విద్యుక్తధర్మమును వీడుట యందు ఆసక్తుడవు కాకుము.

భాష్యము : ప్రతిఒక్కరూ చేసే కార్యములను మూడు రకాలుగా విభజింపవచ్చును. మొదటిది త్రిగుణాల ప్రకారము శాస్త్రములో తెలియజేయబడిన ధర్మాలను పాటించుట. రెండవది ఇష్టానుసారము శాస్త్రములకు విరుద్ధమైన కార్యములను చేయుట. ఇక మూడవది నిర్లక్ష్యము చేత ఎటువంటి ధర్మాలను నిర్వహించకుండుట. ఇక్కడ శ్రీ కృష్ణుడు అర్జునునికి తన ధర్మమైన యుద్ధము చేయవలెనని, అయితే ఫలాసక్తితో చేయవద్దని, ఎందుకనగా ఫలములను ఆశించిన ఎడల తానే కార్యమునకు బాధ్యత వహించి, ఫలితములు అనగా సుఖ దు:ఖములను అనుభవించవలసి వస్తుందని, అది బంధనానికి కారణమగుచున్నదని హెచ్చరించుచున్నాడు. అలాగే ఎందుకు ఇంత శ్రమ తీసుకోవాలి అని భావించి కార్యమును నిరాకరించరాదు. అదికూడా పాపమే ”నేను యుద్ధము చేయను”, అనుట కూడా ఒక బంధనమే. కాబట్టి బాధ్యతతో తన ధర్మాన్ని చేస్తూ ఫలాసక్తిలేని కార్యము ముక్తికి దారి తీస్తుందని, అర్జునుడు ఉపదేశింపబడినాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement